ముంబైకి రెండో విమానాశ్రయం

19 Feb, 2018 03:23 IST|Sakshi
విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కారీ, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, సీఎం ఫడ్నవీస్‌

శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

21 ఏళ్ల తర్వాత మోక్షం.. రూ. 16,700 కోట్ల వ్యయం

విమానయాన రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నాం: మోదీ

నవీ ముంబై/ సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. అలాగే దేశంలోనే అతి పెద్ద నౌకాశ్రయమైన జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌ (జేఎన్‌పీటీ)లోని నాలుగో టర్మినల్‌లో మొదటి దశను మోదీ ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ప్రస్తు తం దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన (ఒకటే రన్‌వే ఉన్న వాటిలో) ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంపై భారాన్ని తగ్గించేందుకు ఈ కొత్త విమానాశ్రయాన్ని అందుబాటులోకి తేనున్నారు.

నవీ ముంబైలో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదన 1997 నుంచి ఉండగా శంకుస్థాపన చేసేందుకు 21 ఏళ్లు పట్టడం గమనార్హం. రూ.16,700 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టును జీవీకే గ్రూప్, సిడ్కో (ముంబై నగర పారిశ్రామికాభివృద్ధి సంస్థ) కలసి నిర్మించనున్నాయి. 2019 చివరి నాటికి తొలిదశ పూర్తయి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని సిడ్కో చెబుతున్నప్పటికీ, కనీసం ఐదేళ్లు పడుతుందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా అనడం గమనార్హం. మొత్తం నాలుగు దశల్లో 2031 నాటికి విమానాశ్రయ నిర్మాణం పూర్తికానుంది.

వృద్ధి అవకాశాలను గుర్తించనే లేదు..
విమానాశ్రయానికి శంకుస్థాపన సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో విమానయన రంగం రోజురోజుకూ వృద్ధి చెందుతున్నా, అందుకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు  అందుబాటులో లేవన్నారు. విమానయాన రంగంలో వృద్ధికి ఉన్న అపారమైన అవకాశాలను గత ప్రభుత్వం గుర్తించలేదనీ, తాము ఆ పని చేసి ఇందుకోసం కొత్త విధానాన్ని సైతం తీసుకొచ్చామని మోదీ పేర్కొన్నారు.

దేశంలో ప్రస్తుతం 450 విమానాలు అందుబాటులో ఉండగా, గత ఏడాది కాలంలోనే 900 కొత్త విమానాలకు కంపెనీలు ఆర్డర్లు ఇవ్వడమే ఈ రంగంలో ప్రగతికి నిదర్శనమన్నారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కారీ, మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, జీవీకే గ్రూప్‌ చైర్మన్‌ వెంకట కృష్ణా రెడ్డి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించలేదంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే మనోహర్‌ భోయిర్‌ నిరసనకు యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు.

50 శాతం పెరిగిన పోర్టు సామర్థ్యం
జేఎన్‌పీటీలో నాలుగో టర్మినల్‌ మొదటి దశ ప్రారంభమవడంతో నౌకాశ్రయం సామర్థ్యం 50 శాతం పెరిగింది. ఇప్పటివరకు జేఎన్‌పీటీకి 4.8 మిలియన్ల కంటెయినర్లను నిర్వహించే సామర్థ్యం ఉండగా తాజాగా ఆ సంఖ్య 7.2 మిలియన్‌ కంటెయినర్లకు చేరింది.  

మా బడ్జెట్‌ ఫలితాలనూ సాధిస్తుంది..
‘మా బడ్జెట్‌ కేవలం ఖర్చు పెట్టడమే కాకుండా ఫలితాలను రాబట్టడంపైనా దృష్టి పెట్టింది. మేం తీసుకొచ్చిన సంస్కరణలు దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి’ అని మోదీ అన్నారు. ముంబైలోని బాంద్రాలో ‘మ్యాగ్నటిక్‌ మహారాష్ట్ర’ ప్రపంచ పెట్టు్టబడిదారుల సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర దేశంలోనే మొదటి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా