భారత వృద్ధికి చోదకశక్తి

25 Sep, 2018 05:22 IST|Sakshi
పాక్‌యాంగ్‌ ఎయిర్‌పోర్టులో మోదీ

ఈశాన్య రాష్ట్రాలను మారుస్తామన్న ప్రధాని మోదీ

పాక్‌యాంగ్‌ విమానాశ్రయం అద్భుతమని ప్రశంస

పాక్‌యాంగ్‌ (సిక్కిం): భారత్‌ అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలను చోదకశక్తిగా మారుస్తామనీ, ఇందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం లో అభివృద్ధి మందగించిందన్నారు. సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని సోమవారం ఇక్కడి పాక్‌యాంగ్‌ పట్టణంలో ఆవిష్కరించిన మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మాట్లాడుతూ..‘హవాయి చెప్పులు వేసుకునే సామాన్యుడు కూడా విమానయానం చేయాలనే దిశగా మేం కృషి చేస్తున్నాం.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ దేశంలో 65 విమానాశ్రయాలు ఉండేవి. కానీ గత నాలుగేళ్లలో కొత్తగా 35 విమానాశ్రయాలను మేం ప్రారంభించాం. గతంలో సగటున ఏడాదికి ఓ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం జరిగితే, ఇప్పుడు ఆ సంఖ్య 9 కి చేరుకుంది’ అని మోదీ చెప్పారు. పాక్‌యాంగ్‌ పట్టణంలో సముద్రమట్టానికి 4,500 అడుగుల ఎత్తులో కొండలపై 201 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని నిర్మించారు. దీన్ని మోదీ ఇంజనీరింగ్‌ అద్భుతంగా అభివర్ణించారు. కొత్తగా ఓ ప్రాంతంలో పూర్తిస్థాయిలో నిర్మించే ఎయిర్‌పోర్టును గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయంగా పిలుస్తారు.

విమానాశ్రయం ఆవిష్కరణ సందర్భంగా మోదీ నేపాలీ భాషలో ప్రసంగాన్ని ప్రారంభించారు. సిక్కిం ప్రజలు ఇక్కడి ప్రకృతి అంత అందమైనవారన్నారు. ఉదయాన్నే చల్లటిగాలి వీస్తుండగా కొండలపై నుంచి సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యం అద్భుతంగా ఉందనీ, ఈ సందర్భంగా ఫొటోలు తీసుకోకుండా తనను తాను నియంత్రించుకోలేకపోయానన్నారు.

మరిన్ని వార్తలు