హక్కులతోనే మెరుగైన జీవితం

13 Oct, 2018 04:27 IST|Sakshi

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ వేడుకల్లో మోదీ

న్యూఢిల్లీ: మానవ హక్కులు సవ్యంగా అమలుపరచడం ద్వారా ప్రజల జీవితాల్ని మెరుగుపరిచేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని  మోదీ అన్నారు. దేశంలో మానవ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసిందని గుర్తుచేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ) 25వ వ్యవస్థాపక దినోత్సవంలో శుక్రవారం మోదీ ప్రసంగించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో ఎన్‌హెచ్‌ఆర్సీ ముఖ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మానవ హక్కుల పరిరక్షణకు స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ, చురుకైన మీడియా, క్రియాశీల పౌర సంఘాలు, ఎన్‌హెచ్‌ఆర్సీ లాంటి సంస్థలు ఉనికిలోకి వచ్చాయని అన్నారు.  

17 లక్షల కేసులు..వంద కోట్ల పరిహారం:
మానవ హక్కుల వాచ్‌డాగ్‌గా పేరొందిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ) ఏర్పాటై శుక్రవారానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 17 లక్షలకు పైగా కేసులను పరిష్కరించిన కమిషన్‌...మానవ హక్కుల ఉల్లంఘనలకు గురైన బాధితులకు సుమారు రూ.100 కోట్లకు పైగా పరిహారం ఇప్పించింది. ఈ కమిషన్‌ ముందుకు వచ్చిన కేసుల్లో పశ్చిమబెంగాల్‌లోని నందిగ్రామ్‌ హింస, ఛత్తీస్‌గఢ్‌లోని సల్వాజుడుం సంబంధిత ఘటనలు కొన్ని ముఖ్యమైనవి.

28న జపాన్‌కు మోదీ
మోదీ ఈ నెల 28–29న జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జపాన్‌ ప్రధాని షింజో అబేతో మోదీ ఇండియా–జపాన్‌ వార్షిక సమావేశంలో పాల్గొని పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై చర్చిస్తారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలోని పరిస్థితులు కూడా ఇరువురు అధినేతల భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు