ఆ బామ్మకు మోదీ పాదాభివందనం

22 Feb, 2016 12:16 IST|Sakshi
ఆ బామ్మకు మోదీ పాదాభివందనం

చత్తీస్ గఢ్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఓ బామ్మకు పాదాభివందనం చేశారు. చత్తీస్ గఢ్లోని మారుమూల ప్రాంతానికి చెందిన ఆ బామ్మకు మోదీ సిరస్సు వంచి నమస్కరించడానికి కారణం.. ఆమె తన ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించుకోవడమే. కారణం చాలా సిల్లీగా అనిపిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడంలో ప్రజల అలసత్వం ఎన్ని అనారోగ్య సమస్యలకు కారణమౌతుందో గుర్తించి.. తనకున్న రెండు మేకలమ్మి మరీ మరుగుదొడ్డి నిర్మించుకొని గ్రామానికి ఆదర్శంగా నిలిచిన ఆ బామ్మకు ప్రధాని మోదీ ఇచ్చిన గౌరవం ఇప్పుడు ప్రశంసలందుకుంటోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ప్రాంతమైన ధమ్‌తరాయ్ గ్రామానికి చెందిన 104 ఏళ్ల కున్వర్ బాయి తన ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాలనుకుంది. అయితే దానికి సరిపడా డబ్బు లేకపోవడంతో తనకున్న రెండు మేకలను అమ్మి ఆ డబ్బుతో అనుకున్నది సాధించింది. దీంతో కున్వర్ బాయిని స్ఫూర్తిగా తీసుకున్న గ్రమస్తులు తమ ఇళ్లలోనూ మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ముందుకొచ్చారు. ఇలా గ్రామ పారిశుధ్యం మెరుగవడానికి కున్వర్ బాయి చేసిన కృషిని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..  శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమెకు పాదాభివందనం చేసి ప్రత్యేకంగా అభినందించారు.

 

మరిన్ని వార్తలు