పెట్టుబడి 0%.. ఫలితాలు 100%

30 Aug, 2019 04:25 IST|Sakshi
కార్యక్రమంలో పాల్గొన్న గౌతం గంభీర్, శిల్పాశెట్టి తదితరులకు మోదీ అభివాదం

ఉద్యమంలా ఆరోగ్య పరిరక్షణ: మోదీ

‘ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌’ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలో ప్రతీ ఒక్కరు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ సూచించారు. ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడంలో భాగంగా ప్రభుత్వం ‘ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌’ను మొదలు పెట్టింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గురువారం దీనిని ప్రారంభించాక మోదీ మాట్లాడారు. ‘ఫిట్‌నెస్‌ అనేది సున్నా శాతం పెట్టుబడి పెడితే వంద శాతం ఫలితాలు ఇచ్చేది. కొన్ని దశాబ్దాల క్రితం ఒక సాధారణ వ్యక్తి కూడా కనీసం 8–10 కిలోమీటర్లు నడవటమో, పరుగెత్తడమో చేసేవాడు. టెక్నాలజీ పెరిగాక ఇది తగ్గిపోయింది. ఫిట్‌నెస్‌ అనేది కేవలం ఒక మాటగా మిగిలిపోకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించేందుకు విప్లవంలా సాగాలి’అని మోదీ వ్యాఖ్యానించారు.  ‘ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌’ను నిరంతరాయంగా కొనసాగించేందుకు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు నేతృత్వంలో 28 మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  

86వేల కోట్ల ఏడీబీ రుణం
భారత్‌కు సుమారు రూ.86 వేల కోట్ల రుణం అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) అంగీకారం తెలిపింది. వచ్చే మూడేళ్లలో పైపుల ద్వారా అందరికీ నీటి సరఫరా, రహదారి భద్రతకు సంబంధించి చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ఈ నిధులను ప్రభుత్వం వినియోగించనుంది. ఏడీబీ ప్రెసిడెంట్‌ టకెహికో నకావో గురువారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.  ఆర్థిక వ్యవస్థ వేగంగా మార్పు చెందేందుకు తమ సాయం దోహదపడుతుందని నకావో అన్నారు.

మరిన్ని వార్తలు