ఇక ఆయుష్మాన్‌ భారతం

24 Sep, 2018 04:48 IST|Sakshi
రాంచీలో మహిళా లబ్ధిదారునకు ఆరోగ్య బీమా కార్డు అందజేస్తున్న మోదీ

అతిపెద్ద ఆరోగ్యబీమా పథకాన్ని ప్రారంభించిన ప్రధాని

ఈ పథకంతో 50 కోట్ల మందికి లబ్ధి

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం

నేనూ పేదరికంలో బతికాను.. ఆ బాధ నాకు తెలుసు: మోదీ

కాంగ్రెస్‌ దృష్టిలో పేదలు ఓటు బ్యాంకు మాత్రమే

బీజేపీ పేదలకు సాధికారత కల్పిస్తుందని భరోసా

రాంచి: దేశంలోని పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుష్మాన్‌ భారత్‌ (ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయుష్మాన్‌ భారత్‌ను ప్రారంభించిన ప్రధాని.. పేదల సేవకు ఉద్దేశించిన పథకాల్లో ఇది అత్యంత ప్రభావవంతమైందని పేర్కొన్నారు. ఆదివారం నుంచే ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

‘పీఎంజేఏవై – ఆయుష్మాన్‌ భారత్‌ పథకం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం. ఈ పథకం ద్వారా భారత్‌లో లబ్ధిపొందేవారి జనాభా.. అమెరికా, కెనడా, మెక్సికోల జనాభా మొత్తంతో సమానం’ అని మోదీ వెల్లడించారు. కాంగ్రెస్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. గత ప్రభుత్వాలు పేదలకు సాధికారత కల్పించకుండా.. వారిని ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, జార్ఖండ్‌ సీఎం రఘువీర్‌ దాస్, గవర్నర్‌ ద్రౌపది ముర్ము తదితరులు పాల్గొన్నారు.

సేవ చేసేందుకు అవకాశంగా..
‘ప్రజలు ఈ పథకాన్ని మోదీ కేర్‌ అని, ఇంకా వేర్వేరు పేర్లతో పిలుస్తున్నారు. కానీ మేం మాత్రం దీన్ని పేదలకు సేవ చేసేందుకు మరో అవకాశంగా భావిస్తున్నాం. సమాజంలో బడుగు, బలహీన వర్గాలకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ పథకాన్ని విజయవంతంగా అమలుచేయడంలో సహకరించే ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. అధికారులందరికీ.. 50 కోట్ల మంది లబ్ధిదారుల ఆశీస్సులు అందుతాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రెండో, మూడో తరగతి నగరాల్లో 2,500 ఆసుపత్రులు ఏర్పాటుకానున్నాయన్నారు.

‘ఇప్పటికే 13వేల ఆసుపత్రులు ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగమయ్యాయి. మా ప్రభుత్వం పేదలకు వైద్యసేవలు అందుబాటులో ఉంచేందుకు సమగ్రమైన విధానంతో ముందుకెళ్తోంది’ అని ఆయన తెలిపారు. ‘గరీబీ హఠావో నినాదాన్ని వింటూనే వస్తున్నాం. ఇది పేదలను మోసం చేసే కార్యక్రమం మాత్రమే. అప్పటినుంచే సంక్షేమ పథకాలు సరిగ్గా అమలుచేసి ఉంటే.. నేటికి దేశం మరింత అభివృద్ధి చెంది ఉండేది. నేను పేదరికంలోనే పెరిగాను. పేదరికాన్ని చూశాను. బీజేపీ ఒక్కటే పేదలకు న్యాయం చేస్తోంది. సాధికారత కల్పిస్తోంది’ అని పేర్కొన్నారు.

వైద్యశాలలు ఖాళీగానే ఉండాలి
‘ఎవరైనా ఆసుపత్రులకు వెళ్లే అవసరం రావొద్దనే దేవుడిని ప్రార్థిస్తాను. కానీ ఒకవేళ పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాల్సివస్తే.. ఆయుష్మాన్‌ కవర్‌ వారికి సేవచేస్తుంది. ధనికులు అనుభవిస్తున్న వసతులను.. నాదేశ పేదలు కూడా అందుకోవాలనేదే ఈ పథకం ఉద్దేశం. కుల, మతాలకు అతీతంగా ఈ పథకాన్ని అమలుచేస్తాం.  సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌ నినాదానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటాం’ అని మోదీ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఈ పథకం ఓ ఉదాహరణలా మిగిలిపోతుందన్నారు. రాంచీ ప్రభాత్‌ తారా మైదానంలో జరిగిన కార్యక్రమంలో కొందరు లబ్ధిదారులకు ఆయన హెల్త్‌ కార్డులు అందజేశారు. అనంతరం చాయ్‌బాసా, కోడర్మాల్లోని వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేశారు.

15 కొత్త ఎయిమ్స్‌లు
వైద్య సేవల మెరుగు కోసం దేశ్యవాప్తంగా 15 కొత్త ఎయిమ్స్‌లకు ఆమోదం తెలిపామన్నారు. ప్రతి రాష్ట్రానికి ఒక ఎయిమ్స్‌ను నిర్మిస్తామని ఆయన చెప్పారు. వచ్చే నాలుగైదేళ్లలో దేశవ్యాప్తంగా లక్ష మంది వైద్యులకు శిక్షణనిచ్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జార్ఖండ్‌లో 10 వెల్‌నెస్‌ సెంటర్లను మోదీ ప్రారంభించారు. ‘జార్ఖండ్‌లో వెల్‌నెస్‌ కేంద్రాలు 40కి చేరాయి. దేశవ్యాప్తంగా మొత్తం 2,300 సెంటర్లు పనిచేస్తున్నాయి. వచ్చే నాలుగైదేళ్లలో ఈ సంఖ్యను 1.5లక్షలకు చేర్చడమే ప్రభుత్వ ధ్యేయం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ వెల్‌నెస్‌ కేంద్రాలు క్షయ, కేన్సర్, మధుమేహం వంటి వ్యాధుల విషయంలో నివారణోపాయాలను సూచిస్తాయి.
పథకం ప్రత్యేకతలివి..
► సమాజంలో పదికోట్ల వెనుకబడిన కుటుంబాల్లోని దాదాపు 50 కోట్ల మంది ఈ పథకం పరిధిలోకి వస్తారు.  
► ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదు. అయితే లబ్ధిదారుడిగా నమోదు చేయించుకునేందుకు ఎన్నికల గుర్తింపు కార్డు లేదా రేషన్‌ కార్డును చూపించాలి.
► గ్రామాలు, పట్టణాల్లో జరిపిన తాజా సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఈసీసీ) ఆధారంగా డీ1, డీ2, డీ3, డీ4, డీ5, డీ7 కేటగిరీల్లో ఉన్నవారు లబ్ధిదారులవుతారు. ఎస్‌ఈసీసీ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణాల్లో 2.33 కోట్ల కుటుంబాలు ఈ పథకాన్ని పొందవచ్చు.  
► ఇప్పటికే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో భాగంగా ఉన్నవారినీ ఆయుష్మాన్‌తో జోడిస్తారు. దేశవ్యాప్తంగా 445 జిల్లాల్లో ఈ పథకం ప్రారంభమైంది.
► ఈ పథకంలో గుండెకు బైపాస్‌ శస్త్రచికిత్స, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, మోకాలిచిప్ప మార్పిడులు, మధుమేహం సహా 1,300కు పైగా వ్యాధులు వర్తిస్తాయి.  
► ఒక కుటుంబంలో ఇంతమందికే అన్న నిబంధనేమీ లేదు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు క్యాష్‌లెస్, పేపర్‌లెస్‌ వైద్యాన్ని అందజేస్తారు.
► ఈ పథకంలో లబ్ధిదారులు ఆసుపత్రి పాలైతే.. చికిత్స కోసం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం సూచించిన లేదా.. పథకం జాబితాలో ఉన్న ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలి.
► ఇలాంటి ఆసుపత్రుల్లో ఆయుష్మాన్‌ మిత్ర హెల్ప్‌ డెస్క్‌ల్లో సరైన గుర్తింపుకార్డులు చూపించాలి.
► పథకం అమలును పర్యవేక్షించే నేషనల్‌ హెల్త్‌ ఏజెన్సీ (ఎన్‌హెచ్‌ఏ)  ఝ్ఛట్చ.pఝ్జ్చy.జౌఠి.జీn సైట్‌ను, 14555 హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను ప్రారంభించింది.
► లబ్ధిదారులకు క్యూఆర్‌ కోడ్‌ ఉన్న లేఖలు ఇస్తారు. వీటిని చూపించి వైద్యం చేయించుకోవాలి.
► ఇప్పటికే 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ, కేరళ, పంజాబ్‌ ప్రభుత్వాలు మాత్రం ఒప్పందంపై సంతకాలు చేయలేదు.

 

మరిన్ని వార్తలు