వారణాసి స్వరూపాన్ని మార్చేశాం

19 Sep, 2018 01:24 IST|Sakshi
వారణాసిలో ప్రధాని మోదీకి జ్ఞాపికను బహూకరిస్తున్న యూపీ సీఎం ఆదిత్యనాథ్‌

ప్రపంచ స్థాయి వసతుల్ని కల్పిస్తామన్న ప్రధాని మోదీ  

రూ. 550 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

వారణాసి: తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రూ. 550 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీగా గత నాలుగేళ్లలో వారణాసిలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని వివరించిన ప్రధాని.. నియోజకవర్గ ప్రజలే తనకు నాయకులు, అధిష్టానమని పేర్కొన్నారు. బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. గత నాలుగేళ్లలో నగర స్వరూపం పూర్తిగా మారిపోయిందని, అభివృద్ధి పనులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని చెప్పారు.

ఇదివరకటి ప్రభుత్వాలు వారణాసి అభివృద్ధిని దేవుడి దయకు వదిలేశాయని విమర్శించారు. 68వ పుట్టిన రోజు వేడుకల్ని సోమవారం వారణాసిలోనే జరుపుకున్న ప్రధాని మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా గడిపారు. పాత కాశీ కోసం ఇంటిగ్రేటెడ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ పథకం(ఐపీడీఎస్‌), బనారస్‌ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లో అటల్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు.  

మీరే నా అధిష్టానం: మోదీ
మీరు నాకు ప్రధాని పదవి బాధ్యత ఇచ్చినప్పటికీ.. ఒక ఎంపీగా గత నాలుగేళ్లలో నేను నియోజకవర్గానికి చేసిన పనుల వివరాల్ని చెప్పడం కూడా నా బాధ్యతే. మీరే నా యజమానులు, అధిష్టానం.. అందువల్ల ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయికి లెక్కచెప్పాల్సిన అవసరముంది’ అని ప్రధాని చెప్పారు. సంప్రదాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షిస్తూ వారణాసిని సమూలంగా మార్చడమే తన ప్రయత్నమని ఆయన అన్నారు. ‘నాలుగేళ్ల క్రితం ఈ పుణ్యక్షేత్రంలో మార్పుల కోసం ఇక్కడి ప్రజలు నిశ్చయించుకున్నారు. ఇప్పుడు ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.

కేవలం వారణాసిలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు కొనసాగుతాయని హామీనిచ్చారు. ‘కాశీ విశ్వనాథుడు, గంగా మాతా ఆశీర్వాదాలతో నేను మరో ఏడాది దేశ సేవను కొనసాగించడం నాకెంతో గర్వకారణంగా ఉంది. మీ ఆప్యాయత, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు.. మీకు, దేశ ప్రజలకు సేవ చేసేలా నా సంకల్పాన్ని దృఢం చేస్తాయి. నేను ఎంపీ కాకముందు ఇక్కడ తరచూ పర్యటించేవాడిని. కరెంటు వైర్ల చిక్కుముడుల నుంచి ఈ నగరం ఎప్పటికి బయటపడుతుందా? అని ఆలోచించేవాడిని. ఇప్పుడు నగరంలోని చాలా భాగం ఆ సమస్య నుంచి విముక్తి పొందింది’ అని మోదీ చెప్పారు.  

తూర్పు భారతదేశ ముఖ ద్వారంగా..
వచ్చే జనవరిలో వారణాసిలో ప్రపంచ ప్రవాస భారతీయ దివస్‌ నిర్వహిస్తున్నామని, ప్రపంచం మొత్తం ఈ నగరం ఇచ్చే ఆతిథ్యం కోసం ఎదురుచూస్తోందన్నారు. తూర్పు భారతానికి గేట్‌వేగా ఉండేలా వారణాసిని తీర్చిదిద్దుతున్నాని, కాశీలో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనే తమ ప్రభుత్వ ప్రయత్నమని ప్రధాని పేర్కొన్నారు. ‘కాశీ ఎల్‌ఈడీ కాంతులతో వెలిగిపోతుంది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. కాశీలోని ఘాట్‌లు ఇప్పుడు చెత్తతో కాకుండా దీపకాంతులతో అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాయి’ అని అన్నారు.

భారత్‌–బంగ్లా మధ్య పైప్‌లైన్‌కు శ్రీకారం
ఢాకా/న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సహకారం ప్రపంచానికి ఒక ఉదాహరణని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘భౌగోళికంగా భారత్, బంగ్లాదేశ్‌ పొరుగు దేశాలు. అయితే భావోద్వేగ పరంగా చూస్తే మాత్రం ఒక కుటుంబంలా కలసిమెలిసి ఉన్నాయి’ అని మోదీ అన్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇరు దేశాల మధ్య నిర్మించనున్న 130 కిలోమీటర్ల ఫ్రెండ్‌షిప్‌ పైప్‌లైన్‌ పనుల్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిని, బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌ జిల్లాలోని పర్బతిపూర్‌ను ఈ పైప్‌లైన్‌ అనుసంధానం చేస్తుంది. రూ. 346 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 30 నెలల్లో పూర్తి కానుంది. ఏడాదికి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆయిల్‌ను సరఫరా చేసే సామర్థ్యముంది. ఈ పైప్‌లైన్‌ ద్వారా అస్సాం గోలాఘాట్‌లోని నుమాలిగఢ్‌ రిఫైనరీ నుంచి బంగ్లాదేశ్‌కు చమురును సరఫరా చేస్తారు.

మరిన్ని వార్తలు