నేడు ప్రధాని ప్రసంగం!

8 Aug, 2019 04:29 IST|Sakshi

‘కశ్మీర్‌’ నిర్ణయాలపై దేశ ప్రజలకు వివరణ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆర్టికల్‌ 370లోని జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే నిబంధనల రద్దు, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్‌లుగా విభజించి, రెండింటినీ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం.. తదితర నిర్ణయాలకు దారితీసిన కారణాలను ఆ ప్రసంగంలో ఆయన దేశ ప్రజలకు వివరించనున్నారు. ఇంతకుముందు మార్చి 27న చివరగా దేశప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఉపగ్రహ నాశక క్షిపణి వ్యవస్థను భారత్‌ సముపార్జించడంపై ఆ ప్రసంగంలో ఆయన స్పందించారు. గతంలోనూ నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా ఆయన ఇలాగే జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోనే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఈ ప్రసంగంలోనూ సంచలన విషయాలనేమైనా ఆయన ప్రకటించే అవకాశముందని కూడా పలువురు భావిస్తున్నారు.

కాగా, ప్రతీ ఏడు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగించే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో.. అంతకుముందు కొన్ని రోజుల ముందే ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా, కశ్మీర్‌ బిల్లును రాజ్యసభ ఆమోదించిన రోజు హోంమంత్రి అమిత్‌ షా చేతిలోని కాగితాల్లో బుధవారమే జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని రాసి ఉన్న విషయం గమనార్హం. అమిత్‌ షా చేతిలో ఆ కాగితాలున్న ఫొటోలు వైరల్‌ కూడా అయ్యాయి. అయితే, బీజేపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణం కారణంగా ఆ ప్రసంగాన్ని గురువారానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు