'అంబేద్కర్ వందేళ్లు ముందే ఊహించారు'

27 Nov, 2015 17:36 IST|Sakshi
'అంబేద్కర్ వందేళ్లు ముందే ఊహించారు'

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై ప్రధాని నరేంద్రమోదీ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. అందరిలో ఒకడిగా తాను రాజ్యాంగంపై స్పందిస్తున్నానంటూ మోదీ ప్రసంగం ప్రారంభించారు. 100ఏళ్ల తర్వాత కూడా ప్రపంచం ఎలా ఉండబోతుందో ఊహించి మహనీయుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలు, బోధనలు తరతరాలకు అనుసరణీయం అని చెప్పారు. రాజ్యాంగంలోని ప్రతిపుటలో అంబేద్కర్ కనిపిస్తారని చెప్పారు. ఆయన అడుగడుగునా కష్టాలు ఎదుర్కొన్నారని అన్నారు.

ఆయన ఆలోచనలు, అనుభవాలు ఎంతో విలువైనవని చెప్పారు. ఆయన పడ్డకష్టాల ప్రభావం భారత రాజ్యాంగంలో ఉందని చెప్పారు. భారత్వంటి పెద్ద దేశానికి రాజ్యాంగం రచించడం అంత సామాన్య విషయం కాదని అన్నారు. దేశపౌరుల గౌరవానికి, దేశ ఐక్యతకు మన రాజ్యాంగం ప్రతీక అని అన్నారు. మహానీయుల కృషివల్లే ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగం మనకు సొంతమైందని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు తపస్సు చేశారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఎంత గౌరవించినా, పొగిడినా తక్కువేనని అన్నారు. రాజ్యాంగంపై నిరంతరం చర్చ జరుగుతూ ఉండాలని, రాజ్యాంగంపై ప్రతి ఒక్క పౌరుడికి అవగాహన కల్పించాలని చెప్పారు.

నేటి ప్రతి పౌరుడికి రాజ్యాంగం అర్ధమయ్యే రీతిలో అవకాశం కల్పించాలని, ప్రజల్లోకి కూడా రాజ్యాంగంపై చర్చను తీసుకెళ్లాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాణం విషయంలో మహనీయుల కృషిని చర్చించిన అందరికీ ధన్యవాదాలని, ప్రతి ఒక్కరు చక్కటి అభిప్రాయాలను తెలిపారని మోదీ సభను ఉద్దేశించి అన్నారు. భారత దేశాభివృద్ధిలో ఎంతోమంది నాయకుల కృషి ఉందని అన్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రాజ్యాంగ భావనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, విద్యాసంస్థల్లో కూడా రాజ్యాంగంపై చర్చ జరగాలని అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఏకాభిప్రాయం వలన బలం చేకూరుతుందని, సంఖ్యాబలంకన్నా ఏకాభిప్రాయం గొప్పదని చెప్పారు.

మరిన్ని వార్తలు