సరిహద్దుల్లో ఉద్రిక్తత: ప్రధాని మోదీ కీలక భేటీ!

26 May, 2020 19:55 IST|Sakshi
భారత ప్రధాని నరేంద్ర మోదీ‌(ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా భారత ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే, చీఫ్‌ ఆఫ్‌ ది ఎయిర్‌స్టాఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ ఆర్కేఎస్‌ బధూరియా, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ తదితరులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.(సరిహద్దుల్లో చైనా హెలికాప్టర్‌–డ్రోన్‌) 

అదే విధంగా విదేశాంగ శాఖ కార్యదర్శితో కూడా ప్రధాని మోదీ ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక సరిహద్దుల వద్ద డ్రాగన్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. ప్రధానితో సమావేశానికి ముందే త్రివిధ దళాల అధినేతలతో చర్చించినట్లు సమాచారం. కాగా గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో భారత్‌- చైనా సైనికుల మధ్య ఘర్షణలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో.. లడఖ్‌ సమీపంలో చైనా ఎయిర్‌బేస్‌ను విస్త్రృతం చేస్తున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అదే విధంగా భారత గగనతలంలోకి చైనా మిలిటరీ హెలికాప్టర్లు చొచ్చుకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలో పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ శత్రు సైన్యాల కదలికలను పసిగట్టేందుకు వీలుగా అభివృద్ధి చేసిన అత్యాధునిక హెలికాప్టర్‌–డ్రోన్‌ను భారత్‌ సరిహద్దుల్లో మోహరించనున్నట్లు చైనా అధికార మీడియా కథనం వెలువరించడం సహా.. భారత్‌లో చిక్కుకుపోయిన చైనీయులు తిరిగి రావాల్సిందిగా భారత్‌లోని రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌లో పేర్కొనడం వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా ఉద్దేశపూర్వకంగానే కవ్వింపు చర్యలకు దిగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేగాక లిపులేఖ్‌ అంశంలో నేపాల్‌ సైతం దుందుడుకు వైఖరి ప్రదర్శించడం వెనుక చైనా ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడం గమనార్హం.(భారత్‌పై నేపాల్‌ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు