ఎస్పీ నిర్వాకంతో నిలిచిన అభివృద్ధి

8 Mar, 2019 15:13 IST|Sakshi

లక్నో: వారణాసిలో ఆలయ అభివృద్ధి, సుందరీకరణ పనులకు సంబంధించి గతంలో ఎస్పీ ప్రభుత్వం సహకరించలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అప్పటి ఎస్పీ సర్కార్‌ నిర్వాకంతోనే తన నియోజకవర్గంలో సుందరీకరణ ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందని అన్నారు. కాశీ విశ్వనాధ ఆలయ అప్రోచ్‌ రోడు, సుందరీకరణ ప్రాజెక్టుకు శుక్రవారం ప్రధాని శంకుస్ధాపన చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులకు తొలి మూడేళ్లలో అధికారంలో ఉన్న ఎస్పీ ప్రభుత్వం సహకరించలేదని, యోగి ఆదిత్యానాథ్‌ను మీరు సీఎంగా చేసిన తర్వాతే ఇక్కడ అభివృద్ధి ప్రాజెక్టులు ఊపందుకున్నాయని చెప్పారు. గత ఎస్పీ ప్రభుత్వం సహకరిస్తే ప్రస్తుతం శంకుస్ధాపనకు బదులు ఆయా పనుల ప్రారంభోత్సవం జరిగి ఉండేదని ప్రధాని చెప్పుకొచ్చారు.

గత ఏడు దశాబ్దాలుగా ఏ ఒక్క ప్రభుత్వం కాశీ విశ్వేశ్వరుడి గురించి ఆలోచించలేదని, ఆయా ప్రభుత్వాలు తమ ప్రయోజనాల కోసమే పనిచేశి కాశీని విస్మరించాయని విమర్శించారు. కాశీని అభివృద్ధి చేయాలన్నది తన చిరకాల స్వప్నమని, అందుకే తాను ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందు పలుసార్లు ఇక్కడికి వచ్చానని, ఇక్కడ అభివృద్ధి జరగాలని కోరుకున్నానన్నారు. కాశీ విశ్వనాధుని ఆశీస్సులతో తన స్వప్నం ఫలించే సమయం ఆసన్నమైందన్నారు.

ఆక్రమణలతో కూరుకుపోయిన కాశీ విశ్వనాధ సన్నిధికి ముక్తి కలుగుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆక్రమణలు తొలగించి తాము సమీప భవనాలు స్వాధీనం చేసుకున్న తర్వాత 40 పురాతన దేవాలయాలు వెలుగులోకి వచ్చాయని, వీటిలో చాలా వరకూ ఆక్రమణలకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు