మోదీ.. ఊరట ఏదీ!

1 Jan, 2017 03:08 IST|Sakshi
మోదీ.. ఊరట ఏదీ!

నోట్ల సమస్యపై మాటల మంత్రం..
ఓట్ల కోసం రాయితీల తంత్రం
పెద్దగా వరాలు ప్రకటించని ప్రధాని
ఎన్నికల రాష్ట్రాలపైనే ప్రత్యేక దృష్టి
రైతులు, గృహ నిర్మాణానికి ‘వడ్డీ’ రాయితీ
గర్భిణుల అకౌంట్లో రూ. 6 వేలు..
రైతులకు నాబార్డు సాయం పెంపు
అక్రమార్కులకు తిప్పలు తప్పవు
కష్టాలు ఎదుర్కొని సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు
జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ


పెద్దనోట్ల రద్దుతో భారీగా లాభం జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయులను ప్రధాని మోదీ తుస్సుమనిపించారు. నోట్లరద్దు తర్వాత సమస్యలు తగ్గుముఖం పట్టేందుకు కేంద్రం ప్రకటించిన 50 రోజుల గడువు పూర్తవడంతో దేశాన్ని ఉద్దేశించి శనివారం ప్రసంగించిన ప్రధాని మోదీ.. కొన్ని తాయిలాలు ప్రకటించడం మినహా ప్రజలకు భారీగా లబ్ధి చేకూర్చే ప్రకటనలేమీ చేయలేదు. రద్దు గాయంతో బాధపడుతున్న దేశ ప్రజలపై తాయిలాలతో పూత పూసే ప్రయత్నం చేశారు. కొత్త ఏడాదికి తీపికబురు అందుతుందని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. ఉసూరుమనిపించారు. త్వరలో యూపీ సహా ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అక్కడి ఓటర్లను ఆకర్షించేలా పలు పథకాలను ప్రకటించారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని తలపించిన మోదీ ప్రకటనలో రైతులు, మహిళలు, చిరు వ్యాపారులపై వరాల జల్లు తప్ప.. నోట్లరద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన మొత్తం, విత్‌డ్రాయల్‌ పరిమితిని ఎప్పుడు ఎత్తేస్తారనే అంశాలపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

న్యూఢిల్లీ: దేశంలో అవినీతిపరులకు మున్ముందు మరిన్ని కష్టాలు ఎదురవనున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. నోట్లరద్దు నిర్ణయం తర్వాత ప్రకటించిన 50 రోజుల డెడ్‌లైన్‌ ముగిసిన నేపథ్యంలో శనివారం జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. అవినీతి పరులకు కష్టాలు తప్పవని హెచ్చరికలు చేస్తూనే.. రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు కష్టాలనెదుర్కొన్నా.. ప్రభుత్వానికి సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ప్రభుత్వం స్నేహహస్తం అందిస్తుందని.. వారి మంచితనానికి సరైన ప్రతిఫలం అందిస్తుందని స్పష్టం చేశారు. పలువురు ప్రభుత్వ, బ్యాంకు అధికారులు నోట్లరద్దును అవకాశంగా వినియోగించుకోవడంపై స్పందిస్తూ.. ‘ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేద’న్నారు. అందరికన్నా మేమే గొప్ప అనే దురభిప్రాయం నుంచి రాజకీయ పార్టీలు బయటకు రావాలన్న మోదీ.. రాజకీయాల ప్రక్షాళనకోసం అందరూ కలసి రావాలని కోరారు. రాజకీయాలను నల్లధనం, అవినీతి నుంచి విముక్తి చేసేందుకు సహకరించాలన్నారు. అవినీతిపై పోరాటంలో ఎంతమాత్రం వెనక్కు తగ్గేది లేదన్నారు. అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తామన్నారు.

చదవండి... (ఇక వేలిముద్రే మీ గుర్తింపు!)

గ్రామీణ భారతంపైనే దృష్టి
బడ్జెట్‌ ప్రసంగాన్ని తలపించిన ఈ ప్రకటనలో.. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల రుణ పరిమితిని పెంచటం, గ్రామీణ, పట్టణాల్లో గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా వడ్డీ తగ్గింపులు, రైతుల రుణాలపై భారీగా వడ్డీ మాఫీ, వయోవృద్ధుల డిపాజిట్లపై వడ్డీ పెంపు వంటివి ప్రధానంగా ఉన్నాయి. డబ్బులు ఎక్కువగా ఉన్న బ్యాంకులు పేదలు, అణగారిన వర్గాలకు రుణాలివ్వాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా సాధారణస్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెడుపై జరిగిన ఈ పోరాటంలో ప్రజలు, ప్రభుత్వం ఒకేవైపు నిలబడటం చారిత్రక పరిణామమన్నారు. ‘ఆర్థిక వ్యవస్థలో డబ్బులు తక్కువగా ఉంటే సమస్యలొస్తాయి. అదే డబ్బులు ఎక్కువైతే పరిస్థితి కఠినంగా మారుతుంది. అందుకే దీన్ని బ్యాలెన్స్‌ చేసేందుకే నోట్లరద్దు నిర్ణయం తీసుకున్నాం’అని మోదీ తెలిపారు. 125 కోట్ల మంది భారతీయుల్లో కేవలం 24 లక్షల మంది మాత్రమే తమ వార్షిక సంపాదన రూ.10 లక్షలకు మించి ఉందని వెల్లడించారన్నారు. ‘ఇది నిజమేనా? మీ చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు, భారీ కార్లు తిరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే లక్షల మంది ఆదాయం 10 లక్షలకు మించి ఉంటుందనిపించటం లేదా? అందుకే ఈ ఉద్యమం నిజాయితీ పరులకోసం, వ్యవస్థను మరింత బలోపేతం చేయటం కోసం’అని మోదీ తెలిపారు. చెలామణిలో ఉన్న లక్షల కోట్ల ధనం బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రావటమే ఈ మిషన్‌ విజయానికి కారణమన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద అదనంగా 33 శాతం ఇళ్లను పేదలకోసం నిర్మించనున్నట్లు తెలిపారు. ‘స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలవుతున్నా.. లక్షల మంది పేదలకు ఇళ్లు లేవు. చాలా మంది మధ్యతరగతి వారికీ ఇల్లు కలగానే మిగిలింది. అలాంటి వారికోసమే ప్రభుత్వం కొత్త పథకాలు తీసుకొస్తోంది’అని ప్రధాని అన్నారు.




రైతులు.. మహిళలపై
నోట్లరద్దు పథకం విజయవంతం కావటంలో సహకరించిన బ్యాంకు ఉద్యోగులను మోదీ ప్రశంసించారు. కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్‌ వ్యవస్థను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నోట్లరద్దుతో వ్యవసాయం దారుణంగా నష్టపోయిందన్న విమర్శల్లో వాస్తవం లేదని.. ఈసారి రబీ సాగులో 6 శాతం వృద్ధి కనిపించిందన్నారు. సహకార బ్యాంకులు, సొసైటీలకు రుణాలివ్వటం ద్వారా నాబార్డుకు జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మహిళలకు ప్రసవానికి ముందు, తర్వాత తమ, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వారి అకౌంట్లలో రూ.6వేల రూపాయలను నేరుగా బదిలీ చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. దీని ద్వారా శిశుమరణాలను గరిష్టంగా తగ్గించవచ్చన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 53 జిల్లాల్లో ఈ పథకం అమలవుతోందని అయితే రూ.4వేలను లబ్ధిదారుల అకౌంట్లలో జమచేస్తున్నారని మోదీ వెల్లడించారు. నోట్లరద్దు కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా.. 125 కోట్ల మంది భారతీయులు ఓపికగా సహకరించారంటూ అభినందించారు. ‘దీపావళి తర్వాత శుద్ధి యజ్ఞంను ప్రారంభించాను. మెజారిటీ భారతీయులు అవినీతి నుంచి విముక్తి అయ్యేందుకే ఈ చారిత్రక ప్రక్షాళన కార్యక్రమానికి అండగా నిలిచారు. వారందరికీ కృతజ్ఞతలు’అని మోదీ తెలిపారు. రబీ కోసం రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ చేసిన 60 రోజుల వడ్డీని నేరుగా వారి అకౌంట్లలోనే జమజేస్తామన్నారు.

భీమ్ యాప్ అంటే ఏంటో తెలుసా?

మోదీ వరాలు
♦ వయోవృద్ధులు చేసే డిపాజిట్లపై (రూ.7.5 లక్షల వరకు) పదేళ్ల వరకు 8 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
♦ గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతరాళ్ల ఆరోగ్య ఖర్చుల నిమిత్తం నేరుగా వారి అకౌంట్లలోకి రూ.6 వేలు జమచేయనున్నారు.
♦ రబీ పంటకోసం జిల్లా సహకార బ్యాంకులు, సొసైటీల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు 60 రోజుల వరకు వడ్డీ మాఫీ.
♦ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న అప్పుల్లో రూ.2 లక్షల వరకు 3 శాతం వడ్డీ మాఫీ.
♦ ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద రెండు పథకాలు ప్రవేశపెట్టిన మోదీ..2017లో గృహ నిర్మాణానికి తీసుకునే 9 లక్షల వరకు రుణానికి 4 శాతం వడ్డీ, 12 లక్షల వరకు రుణానికి 3 శాతం వడ్డీ తగ్గించనున్నట్లు తెలిపారు.
♦ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణసామర్థ్యాన్ని రూ.కోటి నుంచి రెండు కోట్లకు పెంచారు.
♦ మూడు నెలల్లోపు 3 కోట్ల మంది రైతుల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను రూపే కార్డులుగా మార్పు.
♦ నాబార్డు మూలనిధి రెట్టింపు (రూ.41వేల కోట్లకు పెంపు).
♦ ముద్ర యోజన లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు (3.5 కోట్ల నుంచి 7 కోట్లకు పెంపు). మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యం.
 

మరిన్ని వార్తలు