సెల్ ఫోన్ లాగే ఇది కూడా ..: మోదీ

21 Jun, 2016 07:31 IST|Sakshi
సెల్ ఫోన్ లాగే ఇది కూడా ..: మోదీ

చండీగఢ్: సెల్ ఫోన్లలాగే యోగా కూడా జీవితంలో ఒక భాగం కావాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా చండీగఢ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడి క్యాపిటల్ కాంప్లెక్స్‌లో నిర్వంచిన కార్యక్రమంలో 30 వేల మందితో కలసి మోదీ యోగాసనాలు వేశారు. అంతకుముందు ఆయన యోగా ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం అనేది ప్రపంచంలో ఒక సామూహిక ఉద్యమంలా మారిపోయిందని ఆయన అన్నారు. యోగ అనేది మతపరమైన కార్యక్రమం కాదని, ఇది మనసును నియంత్రించి, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుందని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

యోగా దినోత్సవ జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. యోగాను భారత్ నుంచి ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. మానసిక ఏకాగ్రత యోగా వల్ల మాత్రమే సాధ్యమన్నారు. అందరికీ యోగా ఎంతో అవసరమన్నారు. దీనికి ధనిక, పేద తేడాలు లేవన్నారు. దీనికి పైసా కూడా ఖర్చు కాదన్నారు. యోగాతో శరీరం, మనస్సు, బుద్ధి అన్ని వృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు. యోగా ఫిట్‌నెస్ కాదు వెల్‌నెస్ అన్నారు. చిన్నారులకు, గర్భిణులకు, పెద్దలు అందరు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా అవసరమని చెప్పారు. మన దేశంలో చాలామంది ప్రజలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని, వారికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, యోగా చేయడం ద్వారా షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చన్నారు. అన్ని రోగాలను యోగా ద్వార నియంత్రించవచ్చాన్నారు.

ప్రసంగం ముగిసిన అనంతరం మోదీ స్టేడియం ప్రాంగణంలో తిరిగి యోగా చేస్తున్న వారిని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమ వేదికను ఫ్రెంచ్ వాస్తుశిల్పి లే కోర్‌బ్యూసియర్ రూపొందించారు. ప్రాంగణంలో భారీ ఎల్‌ఈడీ తెరలతో ఏర్పాటు చేశారు. ప్రధాని రాక నేపథ్యంలో చండీగఢ్‌లో 5 వేల మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా లక్ష కార్యక్రమాలు ఏర్పాటుచేయగా, ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తోన్న భారీ ఉత్సవాల్లో 57 మంది కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా పలు దేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస‍్తున్నారు. సుమారు 135 దేశాలు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పాటిస్తున్నట్లు  ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధి తెలిపారు.

మరిన్ని వార్తలు