నేతాజీకి ప్రధాని మోదీ నివాళులు

23 Jan, 2020 10:19 IST|Sakshi

న్యూఢిల్లీ: వలసవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి స్వాతంత్ర్యానికై ఉద్యమించిన నేతాజీకి భారతావని ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతీయుల క్షేమం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదన్నారు. గురువారం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్బంగా ప్రధాని మోదీ ఆయనను స్మరించుకున్నారు. ఈ మేరకు... ‘‘జనవరి 23, జనవరి 1897న జానకీనాథ్‌ బోస్‌... ‘ మధ్యాహ్నం కుమారుడు జన్మించాడు’ అని డైరీలో రాసుకున్నారు. ఆ కుమారుడు గొప్ప పోరాట యోధుడిగా నిలిచాడు. భారత స్వాతంత్ర్య సంగ్రామానికి తన జీవితాన్ని అర్పించాడు. ఆయనను స్మరించుకోవడం మనకు గర్వకారణం’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. కాగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా పలువురు ప్రముఖులు నేతాజీకి ట్విటర్‌ వేదికగా నివాళులు అర్పించారు.

అదే విధంగా బాలాసాహెబ్‌ ఠాక్రేకు సైతం మోదీ నివాళులు అర్పించారు. ఠాక్రే జయంతి సందర్భంగా.. ప్రజా సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి​ చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతీయ విలువలకు నిదర్శనంగా నిలిచిన ఆయన.. లక్షలాది మందికి ఆదర్శప్రాయుడని  పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

నేతాజీకి సీఎం జగన్‌ నివాళులు
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 123వ జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. భారత్‌ కోసం ఆయన చూపిన తిరుగులేని పోరాటతత్వం, అసమాన దేశభక్తి.. దేశం స్వాతంత్ర్యం పొందడానికి దోహదం చేసిందని సీఎం జగన్‌ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు నేతాజీ స్ఫూర్తిప్రదాత అని పేర్కొన్నట్టు సీఎంవో ట్విటర్‌లో తెలిపింది.

యువతకు స్పూర్తి: విజయసాయిరెడ్డి
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆయనను స్మరించుకున్నారు. నేతాజీ స్పూర్తితో ఎంతో మంది యువత నాడు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. అటువంటి గొప్ప పోరాటయోధుడికి నివాళులు అర్పిస్తున్నా అని ట్వీట్‌ చేశారు.


 

మరిన్ని వార్తలు