అయోధ్య తీర్పు: ప్రధాని మోదీ వరుస ట్వీట్లు

9 Nov, 2019 13:25 IST|Sakshi

న్యూఢిల్లీ : అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు.. చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని మరోసారి నిరూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరుపక్షాల వాదనలను పూర్తిగా విని... సరైన సమయం తీసుకున్న తర్వాతే చరిత్రాత్మక తీర్పు వెలువడిందన్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యను సుప్రీంకోర్టు పరిష్కరించిన తీరుతో ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు. కీలక తీర్పు వెలువడిన నేపథ్యంలో 130 కోట్ల మంది భారతీయులు సంయమనం పాటించి.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాలని విఙ్ఞప్తి చేశారు.

ఈ మేరకు... ‘అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును ఏ ఒక్కరి విజయంగానో.. మరొకరి పరాజయంగానో భావించరాదు. రామ భక్తులైనా, రహీం భక్తులైనా.. దేశభక్తి భావనను పెంపొందించుకోవాలి. అప్పుడే శాంతి, సౌఖ్యాలు వర్థిల్లుతాయి. ఇది చరిత్రాత్మక తీర్పు. సహృద్భావ వాతావరణంలో ఈ సమస్య పరిష్కరించబడింది. న్యాయ వ్యవస్థలోని స్వతంత్రత, పారదర్శకత, దూరదృష్టి మరోసారి తేటతెల్లమైంది. చట్టం ముందు అందరూ సమానులే అని తేల్చింది. ఐకమత్యంతో అందరం ముందుకు సాగుతూ జాతి అభివృద్ధిలో.. ప్రతీ భారత పౌరుడి అభివృద్ధికి పాటుపడాలి అని నరేంద్ర మోదీ హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో వరుస ట్వీట్లు చేశారు.

కాగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభవోత్సవంలో పాల్గొన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గల వివాదాస్పద స్థలాన్ని (2.77 ఎకరాలు) రామజన్మ న్యాస్‌కే అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అలాగే అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు(సున్నీ వక్ఫ్‌ బోర్డుకు) ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికల హామీ అయిన రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. (చదవండి: అయోధ్య తీర్పు.. అద్వానీదే ఘనత)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా