పటేల్‌ స్ఫూర్తితోనే ‘370’ రద్దు

18 Sep, 2019 02:09 IST|Sakshi
పార్క్‌లోకి సీతాకోకచిలుకలను వదులుతున్న ప్రధాని మోదీ

ఆయన వల్లే తెలంగాణ విమోచన దినం జరుపుకుంటోంది

నర్మదా ఉత్సవాల్లో ప్రధాని మోదీ

కేవాడియా/న్యూఢిల్లీ: సర్దార్‌ పటేల్‌ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దు, కశ్మీర్‌కు సంబంధించి ఇతర కీలక నిర్ణయాలను తీసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. పటేల్‌ కృషి ఫలితంగానే భారత సమాఖ్యలో విలీనమైన తెలంగాణ రాష్ట్రం విమోచన దినం జరుపుకుంటోందని తెలిపారు. 69వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం సొంతరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. సర్దార్‌ సరోవర్‌ జలాశయం వద్ద నర్మదా మాతకు పూజలు చేసి, ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. పలువురు ప్రముఖులు ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నర్మదా సరోవర్‌ జలాశయం పూర్తిగా(138.68 మీటర్లు) నిండిన సందర్భంగా మంగళవారం  కేవాడియాలో  చేపట్టిన ‘నమామి దేవి నర్మదే మహోత్సవ్‌’లో మోదీ పాల్గొన్నారు. 2017లో డ్యామ్‌ ఎత్తు పెంచాక పూర్తిగా నిండటం ఇదే తొలిసారి. అనంతరం ఆయన సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ను,  ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ పటేల్‌ విగ్రహాన్ని బటర్‌ఫ్లై పార్కును సందర్శించి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. కాషాయ రంగులో ఉండే ‘టైగర్‌ బటర్‌ఫ్లై’ని రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటించారు. పటేల్‌ కృషి ఫలితంగా భారత సమాఖ్యలో విలీనమైన తెలంగాణ ఏటా సెప్టెంబర్‌ 17వ తేదీన విమోచన దినం జరుపుకుంటోందన్నారు. సర్దార్‌ సరోవర్‌ జలాశయంతో గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌ ప్రజల అవసరాలు తీరుతాయని తెలిపారు. 

ప్రముఖుల శుభాకాంక్షలు
బీజేపీ చీఫ్‌ అమిత్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా, రాహుల్, బీఎస్పీ చీఫ్‌ మాయావతి, బెంగాల్, తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ సీఎంలు మమతా బెనర్జీ, చంద్రశేఖర్‌రావు, నవీన్‌ పట్నాయక్, కేజ్రీవాల్‌ తదితరులు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ బర్త్‌డే సందర్భంగా ఢిల్లీలో వేర్వేరు చోట్ల బీజేపీ నేతలు కేక్‌లు కట్‌చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో 370 కిలోల కేక్‌ కట్‌చేశారు.

తల్లితో కలిసి భోజనం
పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మాతృమూర్తి హీరాబెన్‌ను కలుసుకున్నారు. అహ్మదాబాద్‌ సమీపంలోని రాయిసన్‌ గ్రామంలోని సోదరుడు పంకజ్‌ ఇంట్లో ఉంటు న్న తల్లితో ప్రధాని అరగంటపాటు గడిపారు. శిరసు వంచి, చేతులు జోడించిన మోదీని హీరాబెన్‌ దీవించారు. అనంతరం తల్లితో కలిసి మోదీ భోజనం చేశారు.

మరిన్ని వార్తలు