అర్బన్‌ నక్సల్స్‌కు కాంగ్రెస్‌ అండ..

9 Nov, 2018 16:38 IST|Sakshi

రాయ్‌పూర్‌ : చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.చత్తీస్‌గఢ్‌ను నక్సల్స్‌ రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పే కాంగ్రెస్‌ పార్టీ అర్బన్‌ నక్సల్స్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు. ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు.

అర్బన్‌ మావోయిస్టులు ఏసీ గదుల్లో కూర్చుని, పెద్ద కార్లలో తిరుగుతుంటారని, వాళ్ల పిల్లలు విదేశాల్లో చదువుకుంటుంటే పేద ఆదివాసీ యువకుల జీవితాలను మాత్రం వారు నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. అర్బన్‌ నక్సల్స్‌ను కాంగ్రెస్‌ ఎందుకు సమర్ధిస్తోందని ప్రధాని నిలదీశారు. బీజేపీ అందరినీ సమదృష్టితో చూస్తుందని, లింగ, కుల ప్రాతిపదకిన ఎవరి పట్లా వివక్ష ప్రదర్శించదని పేర్కొన్నారు.

జగదాల్‌పూర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రదాని ప్రసంగిస్తూ బస్తర్‌ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కట్టుబడిఉందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నా చత్తీస్‌గఢ్‌ అభివృద్ధిపై దృష్టిసారించలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ కేవలం మాటల పార్టీయేనని ఆచరణలో ఆ పార్టీ చేసేది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆదివాసీలు, పేదలు, దళితులను కేవలం ఓటుబ్యాంకుగానే పరిగణిస్తుందని, కానీ వాజ్‌పేయి మాత్రం ఆదివాసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు