మా అణ్వాయుధాలు దివాళీ కోసం దాచామా..?

21 Apr, 2019 19:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ బెదిరింపులకు భయపడే వైఖరికి భారత్‌ స్వస్తి పలికిందని ప్రధాని నరేం‍ద్ర మోదీ స్పష్టం చేశారు. తమ వద్ద అణ్వాయుధం ఉందని పాక్‌ చెబుతుంటే మరి భారత్‌ తన అణ్వాయుధాలను దివాళీ కోసం దాచుకుందా అని ప్రధాని ప్రశ్నించారు. పాక్‌ తరచూ తమ వద్ద అణ్వాయుధం ఉందని చెబుతూ భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తోందని, పాక్‌ అలా చెబుతుంటే మరి భారత్‌ వద్ద ఉన్న అణ్వాయుధాలను దివాళీ కోసం దాచామనుకుంటున్నారా అని దీటుగా బదులిచ్చారు.

రాజస్ధాన్‌లోని బార్మర్‌లో ఆదివారం జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ వరుస పేలుళ్లతో భీతిల్లిన శ్రీలంకకు భారత్‌ బాసటగా నిలుస్తుందని సంఘీభావం ప్రకటించారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటాన్ని సమర్ధిస్తూ మీరంతా కమలం గుర్తుకు ఓటేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాజస్ధాన్‌లో నీటి సమస్యను అధిగమించేందుకు జల్‌ శక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పాకిస్తాన్‌తో సింధూ జలా ఒప్పందం అమలుకు ప్రయత్నించలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ నిర్లక్ష్య వైఖరి కారణంగానే భారత వాటాకు దక్కాల్సిన జలాలు పాక్‌ వైపు మళ్లాయని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు