కోటాపై విపక్షాల దుష్ప్రచారం: ప్రధాని

27 Jan, 2019 16:46 IST|Sakshi

సాక్షి,చెన్నై : అగ్రవర్ణ పేదలకు జనరల్‌ కేటగిరీలో పది శాతం రిజర్వేషన్లు కల్పించడం అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు సంకేతమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అగ్రవర్ణ కోటాపై వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడులోని తోపూర్‌లో ఆదివారం జరిగిన ర్యాలీలో ప్రధాని కోరారు.

సమాజంలోని అన్ని వర్గాలకూ విద్య, ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడిఉందన్నారు. ఇప్పటికే రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందుతున్న దళితులు, గిరిజనులు, ఓబీసీలపై ఎలాంటి ప్రభావం లేకుండా అగ్రవర్ణ పేదలకు కోటా వర్తింపచేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

తమిళనాడులో కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనం కోసం పది శాతం కోటాపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా అంతకుముందు కేరళలోని కొచ్చిలో బీపీసీఎల్‌లో ఇంటిగ్రేడెట్‌ రిఫైనరీ విస్తరణ కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.మరోవైపు తమిళనాడులోని మధురైలోనూ ఎయిమ్స్‌ ఆస్పత్రికి శంకుస్ధాపన చేశారు.

మరిన్ని వార్తలు