ఇది ట్రైలర్‌ మాత్రమే! 

1 Feb, 2019 15:48 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరానికి తీసుకొచ్చిన మధ్యంతర బడ్జెట్‌ సమాజంలోని అన్నివర్గాలకు లబ్ధి చేకూర్చేలా, సాధికారత కల్పించేలా ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం భారత్‌ పురోభివృద్ధికి ఏయే అంశాలు దోహదం చేస్తాయన్నదానికి తాజా బడ్జెట్‌ ట్రైలర్‌ మాత్రమేనని వెల్లడించారు. మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన పలు సంక్షేమ పథకాలను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో శుక్రవారం బడ్జెట్‌ ప్రవేశపెట్టే కార్యక్రమం ముగిసిన అనంతరం మోదీ మీడియాతో మాట్లాడుతూ..‘‘ఈ బడ్జెట్‌తో 12 కోట్లకుపైగా రైతు కుటుంబాలు, అసంఘటిత రంగంలో ఉన్న 30–40 కోట్ల మంది కార్మికులు లబ్ధి పొందుతారు. ప్రభుత్వ చర్యలతో దేశంలో ప్రస్తుతం పేదరికం రేటు గణనీయంగా తగ్గుతోంది. మధ్యతరగతి ప్రజలు, రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంస్‌ఎంఈ)లకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్‌లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈసారి బడ్జెట్‌లో ఆదాయపన్ను మినహాయింపు పొందిన మధ్యతరగతి ప్రజలకు అభినందనలు. దేశ నిర్మాణంలో మీరు చేసిన కృషికి సెల్యూట్‌ చేస్తున్నా’అని తెలిపారు. 

కిసాన్‌ నిధి పథకం చరిత్రాత్మకం.. 
‘గతంలో ప్రభుత్వాలు రైతుల కోసం రకరకాల పథకాలు తీసుకొచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో లబ్ధి చేకూర్చలేకపోయాయి. కానీ ‘ప్రధానమంత్రి కిసాన్‌ నిధి’పేరుతో ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం చరిత్రాత్మకమైనది. దీనికింద 5 ఎకరాల వరకూ భూమి ఉన్న రైతులకు లబ్ధి చేకూరుతుంది. నవ భారత్‌ నిర్మాణంలో భాగంగా పశుపోషణ, చేపల పెంపకం రంగాలపై బడ్జెట్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌ యోజన’కింద దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికులు లాభపడతారు. ఆయుష్మాన్‌ భారత్, ఇతర సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. సంక్షేమ పథకాల ఫలాలు అన్నివర్గాలకు దక్కాలి. ఈ మధ్యంతర బడ్జెట్‌ పేదలకు సాధికారత కల్పిస్తుంది. రైతులకు ప్రోత్సాహం, ఆర్థికాభివృద్ధికి ఊతమందిస్తుంది’’అని పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు