2025కు జీడీపీలో 2.5 శాతం

13 Dec, 2018 04:26 IST|Sakshi

ప్రజారోగ్యంపై ఖర్చు ఆ మేరకు పెంపు

ప్రజలకు చేరువలో క్యాన్సర్‌ నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు

‘పార్ట్‌నర్స్‌ ఫోరం’ సదస్సులో మోదీ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రజారోగ్యంపై భారత్‌ చేస్తున్న ఖర్చును 2025 నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 శాతానికి పెంచుతామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. మహిళలు, చిన్నారులు, యువతను దృష్టిలో పెట్టుకునే తమ ప్రతి పథకం, కార్యక్రమం ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. రెండ్రోజులపాటు జరిగే ‘పార్ట్‌నర్స్‌ ఫోరమ్‌ – 2018’ సదస్సును మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. దేశంలో వైద్య సేవలను పొందేందుకు ప్రజలు తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారనీ, ఆ దుర్గతి నుంచి ప్రజలను బయటపడేయాలన్న తమ ప్రభుత్వ సంకల్పం నుంచే ఆయుష్మాన్‌ భారత్‌ పథకం పుట్టుకొచ్చిందని మోదీ చెప్పారు. ఈ పథకం రెండు భాగాలుగా అమలవుతుందనీ, అందులో ఒకటి ‘ప్రధానమంత్రి ప్రజారోగ్య కార్యక్రమం’ కింద 50 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించడం కాగా, రెండోది ప్రజలకు చేరువలో సమగ్ర ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయడమన్నారు. ఇందుకోసం 2022 నాటికి దేశంలో ఒకటిన్నర లక్షల ఆరోగ్య కేంద్రాలను తమ ప్రభుత్వం ప్రారంభిస్తుందనీ, వీటిలో రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్‌లు, మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ తదితర జబ్బుల నిర్ధారణ సౌకర్యాలు కూడా ఉంటాయని మోదీ చెప్పారు. రోగులకు తమ ఇళ్లకు దగ్గర్లోనే వ్యాధి నిర్ధారణ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు ఉచిత ఔషధాలను కూడా అందించే లక్ష్యంతో ఈ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌ జీడీపీలో 1.15 శాతాన్ని ప్రజారోగ్యంపై ఖర్చు చేస్తుండగా, వచ్చే ఎనిమిదేళ్లలో ఆ మొత్తాన్ని 2.5 శాతానికి పెంచుతామని మోదీ ఈ సదస్సులో చెప్పారు. 

మిషన్‌ ఇంద్రధనుష్‌ మా విజయగాథ.. 
ఆరోగ్యం, మహిళలు, బాలికల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలు, కార్యక్రమాలను మోదీ ‘పార్ట్‌నర్స్‌ ఫోరం’ సదస్సులో వివరించారు. చిన్నారులు, గర్భిణుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ప్రవేశపెట్టిన మిషన్‌ ఇంద్రధనుష్‌ భారత విజయగాథగా నిలుస్తుందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఈ పథకం కింద గత మూడేళ్లలో 3.28 కోట్ల మంది చిన్నారులు, 84 లక్షల మంది గర్భిణులకు ఆరోగ్య సేవలు అందించామనీ, ఈ పథకంలో చిన్నారులకు వేసే టీకాల సంఖ్యను కూడా 7 నుంచి 12కు పెంచామని ఆయన వివరించారు. కౌమార దశలో బాలబాలికల ఆరోగ్యంపై వారికి అవగాహన కల్పించడాన్ని ఎన్నో ఏళ్ల ముందుగానే ప్రారంభించిన దేశాల్లో భారత్‌ ఒకటని మోదీ పేర్కొన్నారు. 2014లో తమ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి దేశంలో ఏడాదికి 44 వేల మంది గర్భిణులు కాన్పు సమయంలో వచ్చే సమస్యల వల్ల మరణించేవారనీ, దీనిని నివారించేందుకు ‘ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ పథకం’ను తాము అందుబాటులోకి తెచ్చామన్నారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు తెచ్చిన ‘పోషణ్‌ పథకం’, జాతీయ బాలల ఆరోగ్య కార్యక్రమం, మహిళలు వంట చేసేందుకు శుద్ధమైన ఇంధనం అందించే ఉజ్వల పథకం తదితరాలను మోదీ పార్ట్‌నర్స్‌ ఫోరంలో వివరించారు. 

మరిన్ని వార్తలు