ఎన్డీయే భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు

17 Nov, 2019 20:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్వల్ప విభేదాలున్నా దేశ ప్రయోజనాల కోసం సమిష్టిగా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే భాగస్వామ్య  పక్షాలను కోరారు. మహారాష్ట్ర రాజకీయాలతో బీజేపీకి శివసేన దూరమైన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు.మనది విశాల కుటుంబమని ప్రజల కోసం సమిష్టిగా పనిచేద్దామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ భాగస్వామ్య పక్షాలను కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో ఎన్డీయేకు పట్టం కట్టారని గుర్తుచేశారు.

మహారాష్ట్రలో బీజేపీకి శివసేన దూరమైన నేపథ్యంలో స్వల్ప విభేదాలు, వైరుధ్యాలు ఎన్డీయేను బలహీనపరచలేవని మోదీ వ్యాఖ్యానించారు. మరోవైపు ఎన్డీయే భేటీ సానుకూలంగా జరిగిందని, తమ కూటమి దేశంలోని వైరుధ్యాలను ప్రతిబింబిస్తూ 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు అద్దంపడుతుందని సమావేశానంతరం ప్రధాని ట్వీట్‌ చేశారు. రైతులు, యువత, మహిళలు, నిరుపేదల జీవితాల్లో గుణాత్మక మార్పు సాధించేవరకూ తాము ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోమని వ్యాఖ్యానించారు.కాగా, శివసేన కీలక ఎన్డీయే భేటీకి హాజరుకాకపోవడం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఇక బీజేపీ కార్యనిర్వాహక సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ సోమవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలకు పార్టీ సభ్యుల హాజరు మెరుగ్గా ఉండేలా చూడాలని సూచించారు. సభలో కీలక అంశాలను లేవనెత్తాలని ఆయన పార్టీ ఎంపీలకు సూచించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు