అది మానవుడి సహజ లక్షణం: మోదీ

11 May, 2020 16:55 IST|Sakshi

కరోనాపై పోరులో రాష్ట్రాలదే కీలక పాత్ర: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వలస కార్మికులు సురక్షితంగా ఇంటికి చేరేలా సాయపడాలని విజ్ఞప్తి చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వలస కార్మికుల గురించి ఆయన మాట్లాడుతూ.. ఇంటికి వెళ్లాలనుకోవడం మానవుడి సహజ లక్షణం అని పేర్కొన్నారు. వలస కార్మికుల తరలింపు ప్రక్రియలో రాష్ట్రాలు సమన్వయం చేసుకుంటూ సహకరించుకోవాలని కోరారు. అదే సమయంలో కరోనా వైరస్‌ గ్రామాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. ఏ ప్రాంతంలోనైనా భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.(‘సోనియా గాంధీ మీ టిక్కెట్లకు డబ్బు చెల్లించారు’)

‘‘కరోనాపై పోరులో మనం విజయవంతమయ్యామని ప్రపంచం అంటోంది. ఈ యుద్ధంలో రాష్ట్రాలదే కీలక పాత్ర. బాధ్యతనెరిగి.. కరోనాను దీటుగా ఎదుర్కొన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని మనం పదే పదే అప్రమత్తం చేస్తూ వచ్చాం. అయితే ఇంటికి వెళ్లాలని కోరుకుకోవడం మానవుని సహజ లక్షణం. అందుకే మన నిర్ణయాలను కొంతమేర మార్చుకున్నాం. ఇక ప్రస్తుతం గ్రామాలకు వైరస్‌ సోకకుండా చూసుకోవడమే మన ముందు ఉన్న అతిపెద్ద సవాలు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హోం మంత్రి అమిత్‌ షా కూడా పాల్గొన్నారు. ఆరోగ్య సేతు యాప్‌ ఆవశ్యకతను వివరిస్తూ.. ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రజలను కార్యోన్ముఖుల్ని చేయాలని ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు.

ఇక ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 24 అర్ధరాత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరస్‌ తీవ్రత దృష్ట్యా ఏప్రిల్‌ 13, మే 3 వరకు మరో రెండు దఫాలు లాక్‌డౌన్‌ పొడిగించిన మోదీ సర్కారు.. మూడోసారి మే 17వ తేదీ వరకు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే గ్రీన్‌ జోన్లు, ఆరెంజ్‌ జోన్లలో ప్రజల రాకపోకలు, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి పలు సడలింపులు ఇచ్చింది. ఇక తాజా వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా లాక్‌డౌన్‌ ఆంక్షలపై ప్రధాని మోదీ మరోసారి ముఖ్యమంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (ప్రత్యేక రైళ్లు: తాజా మార్గదర్శకాలు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు