మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ ఫైర్

13 Feb, 2016 11:06 IST|Sakshi
మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ ఫైర్

న్యూఢిల్లీ:  కొన్ని కీలక విషయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పాలనపై సంచలనవ్యాఖ్యలు చేశారు. బీఫ్ వివాదం, దాద్రీ అసహనం వంటి సమస్యలపై మాట్లాడకపోవటంపై ప్రశ్నించారు. ఆయన భారత్ కు మాత్రమే ప్రధాని అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ చురక అంటించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ప్రస్తుతం విశ్వాస సంక్షోభం తలెత్తిందని మాజీ ప్రధాని విమర్శలు చేశారు.

ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం ఉందన్న భరోసాను ప్రజల్లో కల్పించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందంటూ వ్యాఖ్యానించారు. ముజఫర్‌నగర్‌, దాద్రీ, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న మతపరమైన వివాదాలు, బీఫ్ అంశాలపై మోదీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకొచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా మోదీ ప్రభుత్వం ఇంకా ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించలేదని, ఇంకెప్పుడు ఈ పని చేస్తారంటూ మాజీ ప్రధాని ఎద్దేవా చేశారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కారణంగా ధరలు పెరిగిపోతున్నాయని, వారికంటే తమ యూపీఏ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థే మెరుగ్గా ఉండేదంటూ ఆర్థికవేత్త మన్మోహన్ విమర్శలు గుప్పించారు.

ప్రస్తుత ప్రభుత్వ పాలన వల్ల ద్రవ్యోల్బణం తలెత్తే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ప్రధాని తన ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించడం సంతోషించదగ్గ అంశమే. కానీ, ఆ దేశంతో సంబంధాలను మెరుగు పరుచుకోవడంలో ఇప్పటికీ ముందడుగు పడలేదని ఆరోపించారు. పాక్ తో సంబంధాలపై మోదీ స్థిర నిర్ణయాలు తీసుకోకపోవడాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ తప్పుపట్టారు.

మరిన్ని వార్తలు