మాయావతికి మోదీ చురకలు‌..!

12 May, 2019 19:14 IST|Sakshi

ఆళ్వార్‌ ఘటనపై మాయావతి మొసలి కన్నీరు

కాంగ్రెస్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని హితవు

ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి విమర్శలు

లక్నో : బీఎస్పీ చీఫ్‌ మాయావతికి ప్రధాని నరేంద్ర మోదీ చురకలంటించారు. ఆళ్వార్‌ గ్యాంగ్‌రేప్‌పై మాయావతి మొసలి కన్నీరు కార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, మహిళలకు రక్షణ లేదంటూ స్పీచ్‌లు దంచికొడుతున్న బీఎస్పీ అధినేత రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. ఓ పక్క అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వానికి మద్దతునిస్తూ.. మరోపక్క కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం మాయావతికే చెల్లిందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్‌, డియోరాలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్‌ చీఫ్‌ తరచూ న్యాయ్‌, న్యాయ్‌, న్యాయ్‌ అంటూ స్మరిస్తారని, మరి పట్టపగలే మహిళపై అత్యాచారం జరిగితే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జరిగిందేదో జరిగిపోయిందనే తీరుగా రాజస్తాన్‌ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు.
(చదవండి : భర్త కళ్లెదుటే దారుణం..!)

కాగా, గత నెల 26న భర్తతో కలిసి బైక్‌పై వెళ్తున్న ఓ దళిత మహిళపై ఐదుగురు కామాందులు దాడి చేసి అకృత్యానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధితులను బెదిరింపులకు గురిచేస్తోందని మాయావతి శనివారం విమర్శించారు. ఆళ్వార్‌ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగనుండటంతో నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దళితులు అయినందునే న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు కలగజేసుకుని కేసును విచారించాలని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు