సౌర విప్లవం సాధించాలి

12 Mar, 2018 02:21 IST|Sakshi
అంతర్జాతీయ సౌర కూటమి సదస్సును ప్రారంభిస్తున్న మోదీ, మాక్రాన్‌

అంతర్జాతీయ సౌర కూటమి సదస్సులో ప్రధాని మోదీ

అందరికీ చవకైన సౌర విద్యుత్‌ అందేలా చూడాలని పిలుపు

2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుత్తే లక్ష్యం

సోలార్‌ ప్రాజెక్టులకు రాయితీలపై రుణాలు సమకూర్చాలి: మోదీ

మోదీ ఆలోచన నిజం చేశాం: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అన్ని దేశాలకు చవకైన సౌరవిద్యుత్‌ సులువుగా అందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇంధన రంగంలో సోలార్‌ ఉత్పత్తి వాటాను పెంచాలని, అందుకోసం సోలార్‌ ప్రాజెక్టులకు రాయితీలపై రుణాలు సమకూర్చాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ) వ్యవస్థాపక సదస్సులో ఆదివారం మోదీ ప్రసంగిస్తూ.. 2022 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా భారత్‌ 175 గిగావాట్స్‌ విద్యుదుత్పత్తిని సాధించగలదని, ప్రస్తుత సామర్థ్యానికి అది రెండింతలని పేర్కొన్నారు.

సోలార్‌ ఇంధనాన్ని పోత్సహించే లక్ష్యంతో 121 దేశాల్ని ఒకే వేదికపైకి తేవాలన్న మోదీ ఆలోచన నుంచి పుట్టిందే ఐఎస్‌ఏ(ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌). ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన తొలి సదస్సులో ఆరుదేశాల ఉపాధ్యక్షులు, ఉప ప్రధానులతో పాటు 19 దేశాల నుంచి మంత్రుల స్థాయి బృందాలు పాల్గొన్నాయి.    సోలార్‌ లక్ష్యాల్ని సాధించేందుకు 10 కార్యాచరణ సూత్రాల్ని ఈ సమావేశంలో ప్రధాని మోదీ ప్రతిపాదించారు. చవకైన సోలార్‌ ఇంధనాన్ని అందుబాటులోకి తేవడం, కూటమి సమర్థంగా పనిచేసేలా నిబంధనలు, ప్రామాణికాల రూపకల్పన తదితర అంశాల్ని ఆయన ప్రస్తావించారు.

‘వివిధ అవసరాల్ని తీర్చేందుకు సోలార్‌ రంగంలో ఆవిష్కరణల్ని ప్రోత్సహించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లాభదాయకమైన సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు సలహాలిచ్చే సౌలభ్యాన్ని కల్పించాలి. ఐఎస్‌ఏ శాశ్వత కార్యాలయాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు సమర్ధంగా పనిచేసేలా తీర్చిదిద్దాలి’ అని సూచించారు.  పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి 175 గిగావాట్స్‌ విద్యుదుత్పత్తి లక్ష్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమాన్ని భారత్‌ ప్రారంభించిందని ప్రధాని వెల్లడించారు. సోలార్‌ నుంచి 100గిగావాట్లు, పవన శక్తి నుంచి 60 గిగావాట్లు విద్యుత్‌ అందుబాటులో వస్తుందని, 20 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించేలా ఇప్పటికే సోలార్‌ పవర్‌ యూనిట్లు నెలకొల్పామని ఆయన తెలిపారు.     

నేడు వారణాసికి మోదీ, మాక్రాన్‌
ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ సోమవారం ప్రధాని మోదీతో కలిసి వారణాసిలో గంగానదిలో పడవ ప్రయాణం చేయనున్నారు.

ఐఎస్‌ఏలో చేరేందుకు అమెరికా, చైనా ఆసక్తి
అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ)లో చేరేందుకు అమెరికా, చైనా కూడా ఆసక్తి చూపుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఐఎస్‌ఏ వైపు మొగ్గు చూపుతున్న మొత్తం 121 దేశాల్లో అమెరికా, చైనా కూడా ఉన్నాయని విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి కె.నాగరాజ్‌ నాయుడు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో మిగతా దేశాలతోపాటు చైనా, అమెరికా ప్రతినిధులు కూడా పాల్గొన్నారని మరో కార్యదర్శి టి.ఎస్‌.తిరుమూర్తి చెప్పారు.

ఐక్యంగా సాగితేనే లక్ష్యం సాధ్యం: మాక్రాన్‌
ఈ సదస్సులో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ మాట్లాడుతూ.. 2030 నాటికి ఒక టెరావాట్‌ సౌర విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని సాధించాలంటే 1 ట్రిలియన్‌ డాలర్లు(సుమారు రూ.65 లక్షల కోట్లు) అవసరమవుతాయని తెలిపారు. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడుల కోసం, అవరోధాల్ని అధిగమించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్, సామాజిక సంస్థలు ముందుకు రావాల్సి ఉందన్నారు. ఇందులో తమ వంతుగా 1 బిలియన్‌ యూరోలు (దాదాపు రూ.8000 కోట్లు) వెచ్చించనున్నట్లు ఆయన ప్రకటించారు.  పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగుతున్న అమెరికా తదితర దేశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వారి గురించి పట్టించుకోకుండా ఐఎస్‌ఏ ఏర్పాటుపై దృష్టి పెట్టి విజయం సాధించారన్నారు. ‘మోదీ రెండేళ్ల క్రితం పారిస్‌ వచ్చినప్పుడు ఐఎస్‌ఏ ఏర్పాటు ఆలోచనను చెప్పారు. ఆయన అప్పటి ఆలోచనను ఇప్పుడు మేమంతా కలిసి నిజం చేశాం’ అని పేర్కొన్నారు.  
 

>
మరిన్ని వార్తలు