అవినీతికి చోటులేదు

12 Dec, 2016 15:05 IST|Sakshi
అవినీతికి చోటులేదు

నగదు రహితంతోనే నల్లధనానికి అడ్డుకట్ట ‘లింక్డిన్’లో ప్రధాని
నగదు రహిత మార్పునకు యువత నాయకత్వం వహించాలి

న్యూఢిల్లీ: 21వ శతాబ్దంలో అవినీతికి చోటు లేదని, అది అభివృద్ధిని మందగింప చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేదలు, దిగువ మధ్య, మధ్య తరగతి ప్రజల కలల్ని అవినీతి నాశనం చేస్తుంది’ అని లింక్డిన్.కామ్ వెబ్‌సైట్‌లో రాసిన వ్యాసంలో ప్రధాని పేర్కొన్నారు. కరెన్సీ రూపంలో భారీగా నగదు చెలామణిలో ఉండడం దేశంలో అవినీతి, నల్లధనానికి ఊతమిస్తోందని, దానికి అడ్డుకట్ట వేసేందుకు నగదు రహిత కార్యకలాపాల దిశగా సాగుతున్న మార్పునకు యువత నాయకత్వం వహించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

ఈ విధానం అవినీతి రహిత భారతదేశ నిర్మాణానికి గట్టి పునాదిగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. భారీగా భౌతికరూపంలో నగదు ఉండడం అవినీతి, నల్లధనానికి కారణమవుతోందని, వాటిని నిర్మూలించేందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

‘నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా యువతకు... నగదు రహిత సమాజం దిశగా మార్పునకు నాయకత్వం వహించమని కోరుతున్నా’ అని కోరారు. ‘మనం ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ల యుగంలో నివసిస్తున్నాం. ఆహార పదార్థాల ఆర్డర్‌కు, ఫర్నీచర్ కొనుగోలు, అమ్మకానికి, టాక్సీ సేవల కోసం ఇలా చాలా వాటిని మొబైల్ ద్వారానే నిర్వహిస్తున్నాం. సాంకేతికత మన జీవితాల్లో వేగం, సౌలభ్యాన్ని తీసుకొచ్చింది’ అని వ్యాసంలో ప్రధాని పేర్కొన్నారు.

కార్పొరేట్ల లబ్ధి కోసమే ఈ-వాలెట్లకు ప్రోత్సాహం: కాంగ్రెస్
కొన్ని కార్పొరేట్ సంస్థల ఈ-వాలెట్ వ్యాపారాలకు సాయపడేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైటట్ శుక్రవారం ఆరోపించారు. ప్రభుత్వమే ఎందుకు సొంత ఈ-వాలెట్ వ్యవస్థతో ముందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ వాలెట్ కంపెనీల్లో 60 శాతం వాటా చైనా ప్రజలవేనని, రహస్యాల్ని చైనాకు బహిర్గతం చేస్తున్నారంటూ విమర్శించారు. నోట్ల రద్దును విమర్శిస్తున్న వారు 50 రోజుల గడువు వరకూ ఓపిక పట్టాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లక్నోలో శుక్రవారం చెప్పారు.

మరిన్ని వార్తలు