ఇది ట్రైలర్‌ మాత్రమే..

13 Sep, 2019 04:02 IST|Sakshi
కిసాన్‌ మాన్‌ధన్‌ లబ్దిదారుతో మోదీ

అసలు సినిమా ముందుంది

వందరోజుల పాలనపై మోదీ

బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్‌ మాత్రమే.. సినిమా రావాల్సి ఉంది. అభివృద్ధితోపాటు టెర్రరిజాన్ని సమూలంగా అంతం చేయడం, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడం మా ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికలకు ముందు ఏంచెప్పామో అక్షరాలా అదే చేసి చూపిస్తున్నాం. ఈ 100 రోజుల పాలనే ఒక ఉదాహరణ. మాది అవినీతి వ్యతిరేక ప్రభుత్వం. చట్టానికి అతీతమని భావించిన వారంతా ఇప్పుడు జైలుకెళ్లారు (చిదంబరాన్ని ఉద్దేశించి)..
– రాంచీ సభలో ప్రధాని మోదీ

రాంచీ: బీజేపీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, సినిమా రావాల్సి ఉందని రాంచీలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని మోదీ మరోమారు స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పామో అక్షరాలా అదే చేసి చూపిస్తున్నామనీ, ఈ 100 రోజుల పాలనే ఒక ఉదాహరణ అన్నారు. జార్ఖండ్‌ కొత్త అసెంబ్లీ భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాంచీలో మాట్లాడారు. తమ ప్రభుత్వ 100 రోజుల పాలన ఒక మచ్చుతునక మాత్రమేనన్నారు.

తమ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక ప్రభుత్వమనీ, తాము చట్టానికి అతీతమని భావించిన వారంతా ఇప్పుడు జైలుకెళ్ళారనీ చిదంబరాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మూడు జాతీయ పథకాలను మోదీ జార్ఖండ్‌ నుంచి ప్రారంభించారు. దేశంలోని గడపగడపకీ రక్షిత మంచి నీరు తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ అన్నారు. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రాధాన్యత అనీ, అందుకే త్రిపుల్‌ తలాక్‌ చట్టాన్ని తీసుకొచ్చామనీ తెలిపారు.

కశ్మీర్, లడక్‌ల అభివృద్ధే లక్ష్యంగా పనిచేశామనీ, అందులో భాగంగానే కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని రద్దుచేశామనీ స్పష్టం చేశారు. ఇవన్నీ ఎన్డీఏ–2 వంద రోజుల పాలనలో ఆవిష్కృతమైనవేనని ఆయన గుర్తుచేశారు. రాంచీలో నూతన అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవంతోపాటు ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతు పెన్షన్‌ స్కీంని మోదీ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆదివాసీ విద్యార్థులకోసం 462 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ప్రారంభోత్సవం చేశారు. వీటితో పాటు నూతన సెక్రటేరియట్‌ భవనానికి  మోదీ శంకుస్థాపన చేశారు.

► ‘జాతీయ స్థాయి పథకాల ప్రారంభోత్సవానికి జార్ఖండ్‌ వేదికగా నిలుస్తోంది. గత సెప్టెంబర్‌ లో సైతం ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆరోగ్య పథకం ఆయుష్మాన్‌ భారత్‌ కూడా జార్ఖండ్‌లోని ప్రభాత్‌ తారా గ్రౌండ్‌ నుంచే ప్రారంభించాం. ఈ రోజు మూడు జాతీయస్థాయి సంక్షేమ పథకాలను సైతం ఇక్కడి నుంచి ప్రారంభించాం’ అని అన్నారు.  

► ‘ఆదివాసీలతో సహా ప్రజలందరికీ సుపరిపాలన అందించడం ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఆయుష్మాన్‌ భారత్, పీఎం జీవన్‌ జ్యోతి యోజన, జన్‌ ధన్‌ ఎకౌంట్‌ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం ఆరంభించింది’ అని వెల్లడించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ని పూర్తిగా నిర్మూలించడంలో జార్ఖండ్‌ ప్రజలు క్రియాశీలక పాత్ర పోషించాలని మోదీ పిలుపునిచ్చారు.  

► ‘మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ని ఒక చోటికి సమీకరించి, దేశాన్ని ప్రమాదం నుంచి కాపాడండి’ అంటూ మోదీ ప్రజలకు సూచించారు.  

కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన  
ప్రధాని ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన ద్వారా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు 60 ఏళ్ళు దాటాక నెలకు 3000 రూపాయల పెన్షన్‌ వస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే 1,16,183 మంది రైతులు రిజిస్టర్‌ చేసుకున్నట్టు జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుబర్‌ తెలిపారు.  

స్వరోజ్‌గార్‌ పెన్షన్‌
ఇక్కడ నుంచి ప్రారంభించిన మరో రెండు పథకాలు ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్‌ మన్‌ధన్‌ యోజన, స్వరోజ్‌గార్‌ పెన్షన్‌ స్కీంలు. వీటి ప్రకారం సైతం 60 ఏళ్ల తరువాత లబ్దిదారులకు ప్రతినెలా 3000 రూపాయల పెన్షన్‌ లభిస్తుంది.  


జార్ఖండ్‌ అసెంబ్లీ కొత్త భవనం

మరిన్ని వార్తలు