‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ షోలో మోదీ.. ప్రతిపక్షాల ఆగ్రహం

29 Jul, 2019 17:32 IST|Sakshi

న్యూఢిల్లీ: బేర్‌ గ్రిల్స్‌.. డిస్కవరి ఛానెల్‌ చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్’ షోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బేర్‌ గ్రిల్స్‌.. సోమవారం చేసిన ఓ ట్వీట్‌తో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ‘180 దేశాలకు చెందిన ప్రజలు.. 2019, ఆగస్టు 12నాటి రాత్రి 9గంటలకు మోదీలోని మరో కోణాన్ని చూడబోతున్నారు’ అంటూ ఓ వీడియోను ట్వీట్‌ చేశారు గ్రిల్స్‌. 49 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, బేర్‌ గ్రిల్స్‌తో కలిసి అడవుల్లో సంచరిస్తూ.. నదులను దాటుతూ కనిపించారు. ఈ క్రమంలో గ్రిల్స్‌, మోదీని ఉద్దేశించి.. ‘భారత్‌కు చెందిన ముఖ్యమైన వ్యక్తి ప్రస్తుతం నాతో ఉన్నారు. మిమ్మల్ని క్షేమంగా తిరిగి తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది’ అంటూ కామెంట్‌ చేయడం వినవచ్చు.

ఈ వీడియోలో గ్రిల్స్‌ జంతువుల‌ సంర‌క్షణ‌, ప‌ర్యావ‌ర‌ణ మార్పుల వంటి అంశాలపై మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చిత్రీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇందుకు సంబంధించిన షూటింగ్‌ జరిగినట్లు సమాచారం. అయితే అదే సమయంలో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి చోటు చేసుకున్న సమయంలో నరేంద్ర మోదీ షూటింగ్‌లో పాల్గొన్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అప్పుడాయన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షూటింగ్‌లో పాల్గొన్నారనే విషయం ప్రస్తుతం స్పష్టమైంది.

ఈ షో గురించి ప్రకటించిన వెంటనే ప్రతిపక్షాలు మరో సారి నరేంద్ర మోదీ తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ‘పుల్వామాలో ఉగ్రవాదులు బరి తెగించి 44 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. దేశం అంతా తీవ్ర విషాదంలో మునిగి ఉన్న సమయంలో మోదీ మాత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు. దారుణం గురించి తెలిసిన తర్వాత కూడా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. జవాన్ల మృతి పట్ల మోదీకి ఎంత బాధ ఉందో ప్రోమోలో ఆయన నవ్వు చూస్తేనే అర్థం అవుతుంద’ని విపక్ష నేతలు మండి పడుతున్నారు.

మరిన్ని వార్తలు