కాంగ్రెస్‌ నేతకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ

24 Sep, 2019 13:14 IST|Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నేత మిలింద్‌ దేవ్‌రాకి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. హ్యూస్టన్‌లో మోదీ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ మిలింద్‌ చేసిన ట్వీట్‌కు బదులుగా మోదీ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ' హ్యూస్టన్‌లో మోదీజీ చేసిన ప్రసంగం భారత దౌత్యానికి నిదర్శనం. భారత్‌- అమెరికా బంధాన్ని నెలకొల్పిన తొలితరం నాయకుల్లో మా తండ్రి మురళీదేవ్‌రా కూడా ఉన్నారు. అమెరికా అభివృద్దిలో ఇండో అమెరికన్లు చేస్తున్న కృషిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గుర్తించడం గర్వంగా ఉంది' అని మోదీ ప్రసంగం అనంతరం మిలింద్‌ దేవ్‌రా ట్విటర్‌లో తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. 

మిలింద్‌ ట్వీట్‌కు స్పందించిన ప్రధాని మోదీ... " థ్యాంక్యూ మిలింద్‌ దేవ్‌రా. అమెరికాతో బలోపేతానికి కృషి చేసిన మీ నాన్న, నా స్నేహితుడు మురళీదేవ్‌రాను గుర్తు చేయడం సంతోషమైన విషయం. ప్రస్తుతం ఇరు దేశాల మద్య ఉన్న సంబంధాలను మురళీదేవ్‌రా చూసుంటే చాలా సంతోషించేవారు'' అని అన్నారు.

హ్యూస్టన్‌లో నిర్వహించిన 'హౌడీ మోదీ' కార్యక్రమానికి 50వేలకు పైగా ఇండో-అమెరికన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు చేసిన ప్రసంగాలకు విపరీతమైన స్పందన వచ్చింది. మిలింద్‌ను మోదీ ప్రశంసించడం ఇది రెండోసారి. గతంలో ఆర్టికల్‌ 370 రద్దు సందర్భంగా మిలింద్‌ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. మిలింద్‌ దేవ్‌రా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు సంజయ్‌ నిరూపమ్‌ స్థానంలో ముంబయి కాంగ్రెస్‌ చీఫ్‌గా నిమమితులయ్యారు. గత జూలైలో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మిలింద్‌ సెప్టెంబర్‌ మొదటివారంలో ముంబయి కాంగ్రెస్‌ చీఫ్‌ పదవి నుంచి వైదొలిగారు.


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా