రాజ్యసభలో ప్రతిఘటన తప్పదా?

9 Jan, 2019 04:14 IST|Sakshi

న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు లోక్‌సభలో సజావుగా గట్టెక్కినా, రాజ్యభలో మాత్రం అధికార పార్టీకి ప్రతిఘటన తప్పకపోవచ్చని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఈ బిల్లును హడావుడిగా తేవాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్‌ ఈ బిల్లుకు మద్దతిస్తున్నా ఇతర ప్రతిపక్షాలు మాత్రం అడ్డంకులు సృష్టించే అవకాశాలున్నాయి. రాజ్యసభ సెషన్‌ను ఒక రోజు పొడిగించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విపక్షాలు నేడు సభలో నిరసనకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లుకు విపక్షాలు అడ్డంకులు సృష్టిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాగ్రహానికి గురవుతారని బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. రాజ్యసభలో 73 మంది సభ్యులతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నా సాధారణ మెజారిటీకి చాలా దూరంలో ఉంది. 

మోదీ, షా హర్షం.. 
అగ్రవర్ణ పేదల బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందటం దేశ చరిత్రలో గొప్ప క్షణమని, ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌’ అనే తమ విధానాన్ని అది ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కుల, సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి పేదవాడు గౌరవప్రదంగా జీవించేలా చూసేందుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. ఈ బిల్లు చారిత్రకమని, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి దిశగా పడిన గొప్ప ముందడుగు అని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు.

రాజ్యసభ పొడిగింపుపై విపక్షాల నిరసన  
రాజ్యసభ సమావేశాలను ఒక రోజు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకపక్షమంటూ విపక్షాలు నిరసన చేపట్టాయి. పార్లమెంటు కాంప్లెక్స్‌లోనే నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించాయి. రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడుతో జరిగిన చర్చల్లోనూ.. తమను సంప్రదించకుండా సమావేశాలను పొడిగించారంటూ పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు బిల్లుల ఆమోదం కోసం మంగళవారంతో ముగియాల్సిన రాజ్యసభ సమావేశాలను బుధవారం వరకు కేంద్రం పొడిగించడం తెలిసిందే. అయితే సమావేశాలను పొడిగించే అధికారం సభ చైర్మన్‌కు ఉంటుంది.  

మరిన్ని వార్తలు