విపక్షాలకు మోదీ సవాల్‌..

13 Oct, 2019 15:52 IST|Sakshi

ముంబై : జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకించే వారికి రాజకీయ భవిష్యత్‌ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలను హెచ్చరించారు. ఆర్టికల్‌ 370 అంశంపై ఆయా పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జలగావ్‌లో ఆదివారం జరిగిన ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ విపక్షాలు తాము అధికారంలోకి వస్తే తిరిగి ఆర్టికల్‌ 370, 35(ఏ)లను తీసుకువస్తామని తమ మ్యానిఫెస్టోల్లో హామీ ఇవ్వాలని సవాల్‌ చేశారు. విపక్షాలు మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని, ఆర్టికల్‌ 370ను వారు తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తే వారికి రాజకీయ భవిష్యత్‌ శూన్యమవుతుందని హెచ్చరించారు. గతంలో ఊహించేందుకు సైతం సాహసించని నిర్ణయాన్ని తాము ధైర్యంగా చేపట్టామని భారత్‌ గళాన్ని ఇప్పుడు యావత్‌ ప్రపంచం వింటోదని చెప్పుకొచ్చారు.

స్వాతంత్ర్యం సిద్ధించి 70 ఏళ్లు గడిచినా జమ్ము కశ్మీర్‌లో వాల్మీకి సోదరులు ఇప్పటివరకూ తమ హక్కులను పొందలేదని వాల్మీకి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. 40 ఏళ్లుగా అశాంతితో రగులుతున్న కశ్మీర్‌లో తాము నాలుగు నెలల్లోనే సాధారణ వాతావరణం నెలకొల్పామని చెప్పుకొచ్చారు. దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు పొరుగు దేశం భాషను వాడుతున్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌ను ప్రస్తావించారు. జాతి ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలను సమర్ధించేందుకు విపక్షాలు ఇబ్బంది పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ను తిరిగి తీసుకువచ్చేందుకు విపక్షాలు చొరవ చూపాలని ఆయన సవాల్‌ విసిరారు. వివాదాస్పద ట్రిపుల్‌ తలాక్‌కు కాంగ్రెస్‌ వంతపాడుతోందని, ముస్లిం మహిళలకు న్యాయం జరగడం ఆ పార్టీకి ఇష్టం లేదని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు