సర్జికల్‌ స్టైక్‌ 2 : రాత్రంతా మేల్కొనే ఉన్న మోదీ!

26 Feb, 2019 21:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిపై భారత్ తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకుంది. అత్యాధునిక మిరాజ్‌ 2000 యుద్ధ విమానాల ద్వారా 1000 కిలోల బాంబులను భారత వాయుసేన ఉగ్ర స్థావరాలపై జార విడిచింది. దీంతో వందల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు భారత్‌ చెబుతోంది. దీనిని సర్జికల్‌ స్ట్రైక్‌ 2గా వర్ణిస్తూ యావత్‌ భారత్‌ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్‌ స్ట్రైక్‌-2తో భారతవాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు.. ప్రతి ఒక్కరు ఈ దాడిపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ దాడులను పర్యవేక్షించినట్టు సమాచారం. జైషే ఉగ్రవాదుల స్థావరాలపై మన యుద్ధ విమానాలు బాంబులతో విరుచుకుపడుతున్నప్పుడు మోదీ, కంట్రోల్‌ రూమ్‌లోనే ఉన్నట్టు తెలిసింది. భారత యుద్ద విమానాలు పని పూర్తి చేసుకుని సురక్షితంగా తిరిగి మన భూభాగంలోకి వచ్చిన తర్వాత ఆయన కంట్రోల్‌ రూమ్‌ నుంచి బయటికి వచ్చినట్లు ఓ అధికారి వెల్లడించారు. సోమవారం రాత్రంతా మోదీ నిద్ర పోలేదన్నారు. దాడికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ పలు సూచనలు కూడా ఇచ్చినట్లు సమాచారం.(పక్కా ప్లాన్‌తోనే సర్జికల్‌ స్ట్రైక్‌ - 2)

‘సోమవారం రాత్రి 9.25కల్లా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మోదీ.. రాత్రంతా సర్జికల్‌ స్ట్రైక్‌- 2 పైనే దృష్టి పెట్టారు. రక్షణ మంత్రి నిర‍్మలా సీతారామన్‌,  జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌లతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం 4.30 గంటల వరకూ మోదీ, కంట్రోల్‌ రూమ్‌లోనే ఉన్నారు. యుద్ద విమానాలు పని పూర్తి చేసుకుని సురక్షితంగా తిరిగి భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత ఆయన కంట్రోల్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చారు. అనంతరం రోజూ వారి కార్యక్రమంలో పాల్గొన్నార’ని ఓ అధికారి మీడియాకు వెల్లడించారు. 2016లో జరిగిన మెరుపు దాడులను కూడా మోదీ స్వయంగా అజిత్ డోవల్‌తో కలిసి పర్యవేక్షించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

మరిన్ని వార్తలు