లాక్‌డౌన్‌: రేపు ఉదయం 10 గంటలకు మోదీ ప్రసంగం

13 Apr, 2020 14:39 IST|Sakshi

మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు లాక్‌డౌన్‌పై ఆయన కీలక నిర్ణయం ప్రకటించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్‌లో వెల్లడించింది. కాగా, శనివారం ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మెజారిటీ రాష్ట్రాలు ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒడిషా, పంజాబ్‌, మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలుత ప్రధాని ఈరోజే లాక్‌డౌన్‌పై జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని వార్తలు వెలువడ్డాయి.
(చదవండి: లాక్‌డౌన్‌తో మెరుగైన గంగా నది నీటి నాణ్యత)

దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న తరుణంలో కొన్ని రంగాలకు మినహాయింపు ఇవ్వాలా వద్దా అనే విషయమై కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విమానయాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని.. భౌతిక దూరం పాటిస్తూ (సీటు వదిలి సీటు) విమానాలు నడిపే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇక సోమవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 9,152 చేరుకోగా..  308 మరణాలు సంభవించాయి. 856 మంది వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,987 గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియతో చెప్పారు.
(చదవండి: లాక్‌డౌన్‌ పొడిగింపునకే మొగ్గు!)

మరిన్ని వార్తలు