నేపాల్‌కు ‘హిట్’ ఫార్ములా

4 Aug, 2014 00:59 IST|Sakshi
నేపాల్‌కు ‘హిట్’ ఫార్ములా

అభివృద్ధి కార్యక్రమాలకు భారత్ దన్ను
రాయితీపై రూ. 6 వేల కోట్ల రుణం
నేపాల్ రాజ్యాంగ అసెంబ్లీలో మోడీ ప్రకటన
ఆ దేశ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు
మూడు ఒప్పందాలపై సంతకాలు
విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం

 
కఠ్మాండు: సుదీర్ఘ కాలం తర్వాత నేపాల్‌లో అడుగుపెట్టిన భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ఇక్కడి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ప్రొటోకాల్‌ని పక్కనబెట్టి మరీ నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా స్వయంగా సాదర స్వాగతం పలికారు. నేపాల్ ఇద్దరు ఉప ప్రధానులూ ఆయన వెంట వచ్చారు. 17 ఏళ్ల తర్వాత ఆ దేశంలో అడుగుపెట్టిన భారత ప్రధాని మోడీనే కావడం విశేషం. నేపాల్‌తో సరికొత్త బంధాన్ని ఏర్పరచుకుంటామని ఆ దేశానికి బయలుదేరే ముందు ప్రకటించిన మోడీ అందుకు తగినట్లే వ్యవహరించారు. నేపాల్‌కు ‘హిట్’ ఫార్ములాను ప్రకటించారు. అలాగే అయోడిన్ లోపంతో తలెత్తే జబ్బులను నివారించేందుకు అయోడైజ్డ్ ఉప్పు సరఫరాకు అంగీకరించారు. ఇందుకు రూ. 5 కోట్ల గ్రాంటును కూడా ప్రకటించారు. కాగా, విమానాశ్రయంలో దిగిన మోడీకి నేపాల్ సైన్యం గౌరవ వందనం సమర్పించింది. ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించారు. భారత ప్రధానిని చూడటానికి స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్  ఇతర అధికారులతో కూడిన బృందం మోడీ వెంట వెళ్లింది.  కఠ్మాండులోని ఓ స్టార్ హోటల్‌లో దిగిన మోడీతో తొలుత నేపాల్ విదేశాంగ మంత్రి మహేంద్ర పాండే భద్రత, వాణిజ్యం తదితర అంశాలపై  ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత ఇక్కడి సింగా దర్బార్ సెక్రటేరియట్‌లో నేపాల్ ప్రధాని సుశీల్‌తో మోడీ చర్చలు జరిపారు. నేపాల్‌లో కొనసాగుతున్న శాంతి ప్రక్రియతో పాటు రాజ్యాంగ నిర్మాణం, ఆర్థిక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మూడు ఒప్పందాలపై ఇరువురు నేతలూ సంతకాలు చేశారు. అయోడిన్‌తో కూడిన ఉప్పు సరఫరా, పంచేశ్వర్ ప్రాజెక్టు కోసం రాజ్యాంగ సవరణతో పాటు ఇరు దేశాల అధికారిక టీవీ కేంద్రాలైన  దూరదర్శన్,నేపాల్ టెలివిజన్ మధ్య సహకారంపై ఈ ఒప్పందాలు జరిగాయి. అనంతరం నేపాల్ స్పీకర్‌ను కలిసేందుకు న్యూభనేశ్వర్‌లోని పార్లమెంట్ భవనం వద్దకు మోడీ బయలుదేరారు. మార్గమధ్యంలో కాన్వాయ్‌ని ఆపి మరీ సాధారణ ప్రజలను పలకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

‘హిట్’తో శీఘ్రాభివృద్ధి..

 నేపాల్ రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆ దేశానికి రూ. 6 వేల కోట్ల రాయితీలతో కూడిన రుణాన్ని మోడీ ప్రకటించారు. మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం దీన్ని అందిస్తున్నట్లు  తెలిపారు. ఇప్పటికే అందిస్తున్న సాయానికి ఇది అదనమన్నారు. నేపాల్ వేగంగా అభివృద్ధి చెందేందుకు ‘హిట్(హెచ్‌ఐటీ)’ ఫార్ములాను మోడీ ప్రకటించారు. ‘హిట్ అంటే హెచ్-హైవేస్(జాతీయ రహదారులు), ఐ-ఐవేస్(అంతర్గత రోడ్లు), టి-ట్రాన్స్‌వేస్(వాయు, జల మార్గాలు). ఈ మూడింటి వల్ల నేపాల్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. వీలైనంత త్వరగా ఈ బహుమతిని అందించాలని భారత్ ఆశిస్తోంది’ అని సభ కరతాళ ధ్వనుల మధ్య అన్నారు. నేపాల్‌లో జల విద్యుదుత్పత్తికి అద్భుత అవకాశాలున్నాయని, కేవలం భారత్‌కు విద్యుత్‌ను అమ్మడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన నేపాల్ స్థానం సంపాదించవచ్చని అన్నారు. నేపాల్ రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన రెండో విదేశీ నేతగా మోడీ ప్రత్యేక ంగా నిలిచారు.

మోడీ శాకాహార ప్రియుడు!

పరాయి దేశంలోనూ మోడీ శాకాహారానికే ఓటేస్తున్నారు. ఆదివారం రాత్రి నేపాల్ ప్రధాని సుశీల్.. మోడీకి ఐదు నక్షత్రాల హోటల్‌లో విందు ఇచ్చారు. భారతీయ పాకశాస్త్ర నిపుణుడు (చెఫ్) నందకుమార్ గోపీ సూచనల మేరకు మోడీ కోసం శాకాహార భోజనాన్ని సిద్ధం చేశారు. నాన్‌రోటి, పప్పు, కూరగాయలనే మోడీ ఇష్టపడతారని, బ్రేక్‌ఫాస్ట్‌లో మసాలా టీ, నిమ్మరసం తీసుకోవడానికి ప్రాధాన్యం చూపుతారని ఆ చెఫ్ తెలిపారు.ట
 
నేపాలీల మది దోచుకున్న మోడీ

మోడీ నేపాల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి నేపాలీ భాషలో మాట్లాడి నేపాలీల హృదయాలను కొల్లగొట్టారు.  హిందీలో మాట్లాడేముందు కాసేపు నేపాలీలో మాట్లాడారు. ఇదివరకు యాత్రికుడిగా నేపాల్‌ను సందర్శించానని, ఇప్పుడు  ప్రధానిగా, స్నేహితుడిగా  రావడం  సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. నేపాల్ శస్త్ర(ఆయుధాలు)ను వదిలి శాస్త్ర(విజ్ఞానం) వైపు మళ్లి, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. ఆయన 45 నిమిషాల పాటు మాట్లాడారు.
 

మరిన్ని వార్తలు