కాపలాదారా..కళంకిత సర్కారా..?

28 Mar, 2019 14:21 IST|Sakshi

మీరట్‌ : కాంగ్రెస్‌ సహా గత యూపీఏ సర్కార్‌ను టార్గెట్‌గా చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశ ప్రజలు తమ ప్రయోజనాలు పరిరక్షించే కాపలాదారు కావాలో..కళంకిత సర్కార్‌ (యూపీఏ హయాం) కావాలో తేల్చుకోవాలని కోరారు. బుధవారం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మీరట్‌ నుంచి రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మోదీ ప్రారంభించారు.

ప్రజలు తాము ఎవరికి ఓటు వేయాలో ఓ అంచనాకు వచ్చారని చెప్పుకొచ్చారు. ఓ వైపు గట్టి కాపలాదారు ఉంటే మరోవైపు కళంకిత సర్కార్‌ ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై యూపీఏ ప్రభుత్వం మెతకవైఖరి అవలంభించిం‍దని, ఉగ్రవాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ముందు అప్పటి ప్రభుత్వం వారి మతాలపై ఆరా తీసిందని ఆరోపించారు.

తమ ప్రభుత్వం ఉగ్రవాదులపై గగనతలం, భూతలం, శాటిలైట్‌ ఇలా అన్నిటా మెరుపు దాడులు చేపట్టిందని చెప్పారు. ‘ఐదేళ్ల కిందట మీ ప్రేమాభిమానాలు కోరితే మీరు ఎంతో ప్రేమ పంచారు..మీ ప్రేమను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను..కాపలదారు అన్యాయం చేయలే’దని మోదీ పేర్కొన్నారు. నిర్ణయాత్మక ప్రభుత్వానికి, గత అసమర్ధ పాలనకు నడుమ సార్వత్రిఎ ఎన్నికల సమరం సాగుతోందని చెప్పారు.

>
మరిన్ని వార్తలు