పాలకు, మెర్సిడెజ్‌కు ఒకే పన్నా?

2 Jul, 2018 02:49 IST|Sakshi

అన్ని వస్తు, సేవలకు ఒకే జీఎస్టీ రేటు అసాధ్యం!

18% పన్ను ఉండాలన్న కాంగ్రెస్‌ ఆలోచన సరికాదు

జీఎస్టీకి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని వస్తువులపై ఒకే జీఎస్టీ రేటును అమలుచేయడం సాధ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పాలకు, మెర్సిడెజ్‌ కారుకు ఒకే పన్ను విధించడం సరికాదన్నారు. అన్ని వస్తువులపై ఏకరూపకంగా 18% జీఎస్టీ ఉండాలన్న కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన సరైంది కాదని.. ఇలాంటి నిర్ణయాల ద్వారా ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయన్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ అమలుకు ఏడాది పూర్తయిన సందర్భంగా ‘స్వరాజ్య’ అనే మేగజైన్‌కు ప్రధాని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్, వివిధ రకాల కేంద్ర, రాష్ట్రాల పన్నులను కలిపి పరోక్ష పన్నుల విధానాన్ని సరళతరం చేసేందుకే జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చామని మోదీ తెలిపారు.

జీఎస్టీ ద్వారా ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌ తగ్గిపోయిందన్నారు. రాష్ట్రాలు, వ్యాపారులు, ఇతర భాగస్వామ్య వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటికప్పుడు జీఎస్టీలో సానుకూల మార్పులు కూడా తెస్తున్నామని ప్రధాని వెల్లడించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ ప్రజలకు అభినందనలు. సహకార సమాఖ్య విధానానికి, టీమిండియా స్ఫూర్తికి ఇదో గొప్ప ఉదాహరణ. ఒకే దేశం–ఒకే పన్ను విధానం ద్వారా అభివృద్ధి జరగడంతోపాటు పన్ను విధానంలో సరళత, పారదర్శకత పెరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో జీఎస్టీ ఓ సానుకూల మార్పు తీసుకొచ్చింది’ అని ఆదివారం ఉదయం మోదీ ట్వీట్‌ చేశారు. ఏడాదిలో జీఎస్టీ ద్వారా సాధించిన విజయాలతో కూడిన పోస్టర్‌ను అందులో ఉంచారు.  

ధరలు పెంచడమే వారి ఆలోచన
‘అన్ని వస్తువులకు ఒకే పన్నురేటు అమల్లో ఉంటే చాలా సులభంగా, సౌకర్యంగా ఉండేది. కానీ దీని ప్రకారం చూస్తే.. ఆహార వస్తువులపై 0% పన్నురేటు ఉండటం సాధ్యం కాదు. పాలకు, విలాసవంతమైన మెర్సిడెజ్‌ కారుకు ఒకే పన్నురేటు ఉండటం సమంజసమేనా? కాంగ్రెస్‌ పార్టీలోని మన మిత్రులు ఒకే జీఎస్టీ రేటు ఉండాలని అడుగుతున్నారు. అంటే.. ప్రస్తుతం 0–5% పన్ను రేటు మధ్యనున్న ఆహార వస్తువులు, నిత్యావసర వస్తువులకు కూడా 18 శాతం పన్ను విధించాలనేది వారి ఆలోచన’ అని మోదీ ‘స్వరాజ్య’ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

స్వాతంత్య్రానంతరం నుంచి నేటి వరకు దేశంలో 66 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుంటే.. ఇందులో 48 లక్షల మంది 2017, జూలై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చాకే పన్ను చెల్లింపులోకి వచ్చారని ప్రధాని వెల్లడించారు. ‘ఏడాది కాలంలో 350 కోట్ల బిల్లులు ప్రాసెస్‌ అయ్యాయి. 11 కోట్ల రిటర్న్స్‌ ఫైల్‌ అయ్యాయి. దేశవ్యాప్తంగా చెక్‌పోస్టులు రద్దయ్యాయి. రాష్ట్రాల సరిహద్దుల వద్దనున్న వాణిజ్య పన్నుల కార్యాలయాల వద్ద క్యూలు కట్టాల్సిన పనిలేకుండా పోయింది. ఇది ట్రక్కు డ్రైవర్ల విలువైన సమయాన్ని ఆదా చేస్తోంది. లాజిస్టిక్స్‌ రంగానికి భారీగా ఊతమందుతోంది. తద్వారా దేశంలో ఉత్పత్తి పెరుగుతోంది. ఒకవేళ జీఎస్టీ సంక్లిష్టంగా ఉండుంటే ఇవన్నీ జరిగేవేనా?’ అని మోదీ ప్రశ్నించారు.

నిత్యావసరాల ధరలు తగ్గాయ్‌..!
‘మీరు ఏం చూస్తున్నారో.. అదే చెల్లిస్తున్నారు. దాదాపు 400 వస్తువులపై ప్రభుత్వం పన్నులు తగ్గించింది. 150 వస్తువులు 0% పన్ను పరిధిలో ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలను గమనించినట్లయితే.. వాటి ధరలన్నీ తగ్గాయి. బియ్యం, గోధుమలు, చక్కెర, మసాలా దినుసులు వంటి వాటిపై పన్నులు చాలామేర తగ్గించాం. రోజువారీ వినినియోగంలో వచ్చే దాదాపు అన్ని వస్తువులను 5%లోపు పరిధిలోనే ఉంచాం. దాదాపు 95% వస్తువులు 18% లోపు జీఎస్టీ శ్లాబ్‌ లోనే ఉన్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌లో పన్నువిధానంలో భారీగా మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేశామన్న ప్రధాని.. ఈ క్రమంలో (జీఎస్టీ అమలులో) కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

‘17 పన్నులు, 23 సెస్సులను సంస్కరించి ఒక పన్నుగా మార్చాం. సరళంగా, వ్యవస్థ సున్నితత్వానికి తగినట్లుగా దీన్ని రూపొందించాం. ఓ గొప్ప సంస్కరణ వచ్చినపుడు బాలారిష్టాలు సహజమే. కానీ మేం వీటిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటిని పరిష్కరిస్తూనే ఉన్నాం. సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ సంస్కరణే గొప్ప ఉదాహరణ’ అని మోదీ తెలిపారు. కేంద్రంలో గత కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలతో ఈ ఏకాభిప్రాయం సాధించడంలోనే విఫలమయ్యాయన్నారు. 

మరిన్ని వార్తలు