బెంగాల్‌కు తక్షణ సాయం వెయ్యి కోట్లు

23 May, 2020 04:46 IST|Sakshi

ఒడిశాకు రూ.500 కోట్లు ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే

బసీర్హాట్‌/కోల్‌కతా/భువనేశ్వర్‌: ఉంపన్‌ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌కు తక్షణ సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం బెంగాల్‌లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మోదీ వెంట ఉన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసీర్హాట్‌లో గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తుపాను వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందజేస్తామన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారిపై పోరాడుతూనే మరోవైపు తుపాను సహాయక చర్యలు చేపట్టడంలో సమర్థంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రధాని ప్రశంసించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశం మొత్తం బెంగాల్‌ ప్రజలకు అండగా ఉంటుందని మోదీ చెప్పారు.  
 
రూ.లక్ష కోట్ల నష్టం: మమతా బెనర్జీ  
ఉంపన్‌  తుపాను వల్ల పశ్చిమ బెంగాల్‌కు రూ.లక్ష కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. మొత్తం నష్టాన్ని అంచనా వేయడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. పలు పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.53 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు.  

బెంగాల్‌లో 77కి చేరిన మరణాలు  
బెంగాల్‌లో ఇప్పటిదాకా అంపన్‌ తుపాను వల్ల మరణించిన వారి సంఖ్య 77కు చేరింది. రాజధాని కోల్‌కతా సహా దాదాపు సగం జిల్లాలు అంపన్‌ ధాటికి దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా, మొబైల్‌ సేవలను  పునరుద్ధరించారు.  

ఒడిశా సీఎంకు ప్రధాని ప్రశంస
సైక్లోన్‌ వల్ల నష్టపోయిన ఒడిశాకు రూ.500 కోట్ల తక్షణ సాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం ఒడిశాలో తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వేలో పాల్గొన్నారు. అనంతరం గవర్నర్‌ గణేశీలాల్, సీఎం నవీన్‌ పట్నాయక్, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను నష్టంపై నివేదిక వచ్చాక  తదుపరి ఆర్థిక సాయం ప్రకటిస్తామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడంతో గొప్ప చొరవ చూపారని ఒడిశా ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. తుపాను కారణంగా తమ రాష్ట్రంలో 45 లక్షల మంది ప్రభావితులైనప్పటికీ, వేలాది ఇళ్లు దెబ్బతిన్నప్పటికీ ప్రాణనష్టం జరిగినట్లు  సమాచారం అందలేదని ఒడిశా ప్రభుత్వం తెలిపింది.

జాతీయ విపత్తుగా ప్రకటించాలి: విపక్షాలు
పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అంపన్‌ తుపాను సృష్టించిన బీభత్సాన్ని వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని 22 ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఆయా రాష్ట్రాలను సముచిత రీతిలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాయి. 22 పార్టీల నేతలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలకు, ప్రజలకు అండగా ఉంటామని తీర్మానంలో పేర్కొన్నారు. సహాయ, పునరావాస చర్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలకు సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో తృణమూల్‌ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, కమ్యూనిస్టు తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు