సంయమనం పాటించండి

13 Jul, 2016 01:03 IST|Sakshi
సంయమనం పాటించండి

కశ్మీరీలకు ప్రధాని విజ్ఞప్తి
- మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
- 25కు చేరిన మృతులు   

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ ప్రజలు  ప్రశాంతత పాటించాలని, అప్పుడే రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. రాష్ట్ర పరిస్థితిపై మంగళవారం ఆయన ఉన్నత స్థాయి భేటీలో సమీక్షించి, ఆందోళన వ్యక్తం చేశారు. అమాయక ప్రజలకు ఎలాంటి ఇబ్బందిగాని, ప్రాణనష్టంగాని జరగకూడదని ఆకాంక్షించారని పీఎంఓ కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతున్న తీరుపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారని, కశ్మీర్ ప్రభుత్వం ఎలాంటి సాయం కోరినా అందించేందుకు సిద్ధమనిచెప్పారని సింగ్ పేర్కొన్నారు. ఆఫ్రికా పర్యటన నుంచి వచ్చిన కొద్ది గంటల్లోపే ప్రధాని ఈ  భేటీ నిర్వహించారు.

హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్, అనంతర ఆందోళనలు, పోలీ సును నదిలోకి తోసేయడం వంటి సంఘటనలపై మోదీకి మంత్రులు, అధికారులు పూర్తి వివరాలు అందచేశారు. ఈ సందర్భంగా కశ్మీ ర్ అల్లర్లపై మీడియాలో జరిగిన ప్రచారంపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఉన్నత వర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని హీరోగా చిత్రీకరించడంతో అతని అనుచరులు పెద్ద ఎత్తున రెచ్చిపోవడానికి కారణమైందని మోదీ అన్నట్లు తెలుస్తోంది. వనీపై 12కి పైగా కేసులు నమోదయ్యాయని, అందులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)కింద కూడా కేసులు ఉన్నాయని ప్రధాని పేర్కొన్నట్లు సమాచారం.కశ్మీర్‌కు గతంలో కేంద్రం ఇస్తానన్న రూ. 80 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయంపై సమీక్షించారు. వనీ మృతిపై పాకిస్తాన్ స్పందనను, పాక్ ప్రధాని  షరీఫ్ ప్రకటనను విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ ప్రధానికి వివరించారు. సమావేశంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణమంత్రి మనోహర్ పరీకర్,  జితేంద్ర సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు.

 రాజ్‌నాథ్ అమెరికా పర్యటన వాయిదా
 కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ తన అమెరికా పర్యటన వాయిదా వేసుకున్నారు. వచ్చేవారం  భారత్-అమెరికా అంతర్గత భద్రతా చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. జూలై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, కశ్మీర్ పరిస్థితి దృష్ట్యా పర్యటన వాయిదా వేసుకున్నారని అధికారులు చెప్పారు.

 25కు చేరిన మృతులు.. కశ్మీర్‌లో మంగళవారం చెదురుమదురు హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 25కు చేరింది. మొత్తం 350 మంది గాయపడగా, వారిలో 115 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. కుప్వారా జిల్లాలో అల్లరి మూకపై భద్రతా దళాల కాల్పుల్లో ఒకరు మృతిచెందారని పోలీసు వర్గాలు తెలిపాయి.  శ్రీనగర్‌కు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొపోర్ పోలీసు పోస్టుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ సందర్భంగా భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఏడెనిమిది రౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. శ్రీనగర్ నూర్‌బాగ్ ప్రాంతంలో పహారా కాస్తున్న పోలీసులపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. త్రాల్, నౌదల్, గడ్‌బగ్, బట్‌నాగ్, చింద్రిగామ్, సోపియాన్, మెమందర్, ఫ్రిసల్, యారిపోరా, రుహామా, రాజ్‌పోరా, నెవా బిజ్‌బెహరా తదితర ప్రాంతాల్లో భద్రత దళాలపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. గడ్‌బగ్, బట్‌నాగ్, త్రాల్, రుహామాలో పోలీసు గార్డుల గదుల్ని అల్లరిమూకలు దహనం చేశాయి.  దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురా ప్రాంతంలో అల్లరిమూక పోలీసు ఎస్‌ఐ భార్య, కుమార్తెను గాయపరచడంతో పాటు ఇంటిని ధ్వంసం చేశారు. వారికి అవంతిపురా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
 
 శ్రీనగర్, దక్షిణ కశ్మీర్‌లో కొనసాగుతున్న ఆంక్షలు
 కశ్మీర్‌లో సాధారణ జనజీవనం ఇంకా అస్తవ్యస్తంగానే ఉంది. శ్రీనగర్‌తో పాటు దక్షిణ కశ్మీర్‌లోని నాలుగు జిల్లాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. వేర్పాటువాద గ్రూపులు ఇచ్చిన బంద్ పిలుపుతో కశ్మీర్‌లోయలో సాధారణ జనజీవనం స్తంభించింది. వేర్పాటువాద గ్రూపులు బంద్‌ను జూలై 13 వరకూ పొడిగిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దుకాణాలు, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు మంగళవారం కూడా పూర్తిగా మూతబడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల్లో సిబ్బంది చాలా తక్కువగా హాజరయ్యారు. వరుసగా నాలుగో రోజు ప్రజా రవాణా స్తంభించింది. ఆంక్షలు లేని ప్రాంతాల్లో ప్రైవేట్ కార్లు, ఆటోలు కొద్ది సంఖ్యలో నడిచాయి. వేసవి సెలవులు కొనసాగుతున్నందున కశ్మీర్ లోయలో స్కూళ్లు ఇంకా మూతబడే ఉన్నాయి. వర్సిటీలు, కశ్మీర్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌లు పరీక్షల్ని వాయిదా వేశాయి.

>
మరిన్ని వార్తలు