రూ. 64 వేల కోట్లపై మోదీ కన్ను?

14 May, 2015 11:58 IST|Sakshi
రూ. 64 వేల కోట్లపై మోదీ కన్ను?

చైనా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటనలో వివిధ వాణిజ్య ఒప్పందాలతో పాటు, సరిహద్దు సమస్యలు, వీసా తదితర అంశాలపై  దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 64 వేల కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మూడురోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు.  తన తొలిరోజు పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్వస్థలం,  అత్యంత పురాతన నగరం జియాన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని జియాన్‌లోని జింగ్‌షాన్ ఆలయాన్ని, టెర్రకోట యుద్ధవీరుల మ్యూజియాన్ని కూడా సందర్శించారు. తాను మ్యూజియాన్ని సందర్శించిన సమాచారాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు మోదీ. ద జింగ్షాన్ లోని ప్రముఖ బౌద్ధ దేవాలయం గోల్డెన్ టెంపుల్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బౌద్ధ బిక్షువుల ప్రార్థనల మధ్య బంగారు బుద్ధుని విగ్రహానికి ముకుళిత హస్తాలతో  అంజలి ఘటించారు.

మరోవైపు జియాన్ నగరంలోనే చైనా అధ్యక్షుడితో ప్రధాని సమావేశం కానున్నారు. చైనా  ప్రధాని లికెక్వియాంగ్తో మోదీ సమావేశమై సరిహద్దు సమస్యలు సహా పలు అంశాలపై  చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 20 రకాల వాణిజ్య అంశాలపై ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం.  దాదాపు  64 వేల కోట్ల  రూపాయల మేరకు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. చైనాలో నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది.  సంప్రదాయ నృత్యాలతో కళాకారులు స్వాగతం పలికారు. ఈ నెల 19 వరకు ఆయన చైనా, మంగోలియా, దక్షిణ కొరియా దేశాలలో పర్యటించనున్నారు.

మరిన్ని వార్తలు