భారత్‌ చేరుకున్న ప్రధాని మోదీ

7 Sep, 2017 15:17 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చైనా, మయన్మార్‌ దేశాల పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం భారత్‌ చేరుకున్నారు. బ్రిక్స్‌ సదస్సు‍లో పాల్గొనేందుకు తొలుత చైనా వెళ్లిన మోదీ.. అక్కడ నుంచే మయన్మార్‌ పర్యటనకు వెళ్లారు. చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. అనంతరం మయన్మార్‌ వెళ్లిన మోదీ  మూడు రోజుల పర్యటనలో భాగంగా  ప్రముఖ చారిత్రక, వారసత్వ కట్టడం శ్వేతగోన్‌ పగోడాను సందర్శించుకున్నారు.

యాంగూన్‌ రాయల్‌ లేక్‌ సమీపంలోని ఈ పగోడాలో బుద్ధ భగవానుని కేశాలు, ఇతర అమూల్య వస్తువులను భద్రపరిచారు. ఈ పగోడాను అత్యంత పవిత్రమైనదిగా బర్మా ప్రజలు భావిస్తుంటారు. పగోడా చుట్టూ బంగారు రేకుల తాపడం ఉంటుంది. దీనిపై 4,531వజ్రాలు పొదిగిన స్తూపం, స్తూపం శిఖరంపై 72 క్యారెట్ల భారీ వజ్రం అమరి ఉంటుంది. శ్వేతగోన్‌ పగోడాను దర్శించుకోవటం మర్చిపోని అనుభూతి అని మోదీ ట్వీట్‌ చేశారు. అనంతరం ఆయన బోగ్యోకే అంగ్‌ సాన్‌ మ్యూజియంను దర్శించారు.

ప్రధాని వెంట మయన్మార్‌ స్టేట్‌ కౌన్సిలర్‌ అంగ్‌సాన్‌ సూకీ ఉన్నారు. అలాగే, చిట్టచివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌షా జాఫర్‌(87) సమాధిని మోదీ సందర్శించి, నివాళులర్పించారు. ఉర్దూ కవి, రచయిత అయిన బహదూర్‌షా 1857 సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో బ్రిటిష్‌ వారికి భయపడి దేశం విడిచి బర్మాలో అజ్ఞాతంలో ఉంటూ ఇక్కడే చనిపోయారు. అమరవీరుల మాసోలియంను దర్శించి, కాలిబారీ ఆలయంలో పూజలు చేశారు. ఆలయంలో ఉన్న ఫొటోతో ఆయన ట్వీట్‌ చేశారు. చైనాలోని జియామెన్‌ నగరంలో బ్రిక్స్‌ దేశాధినేతల సమావేశంలో పాల్గొన్న అనంతరం మూడు రోజుల ఆయన మయన్మార్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు