సీఏఏను గట్టిగా సమర్థించండి

1 Feb, 2020 04:04 IST|Sakshi
మీడియాకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ

ఎన్డీయే సభ్యులకు పీఎం సూచన

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పార్లమెంట్లో విపక్షాలను సమర్థంగా ఎదుర్కోవాలని ఎన్డీయే పక్ష సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. సీఏఏ విషయంలో ప్రభుత్వం తప్పేం చేయలేదని, చట్టాన్ని సమర్థిస్తూ గట్టిగా వాదనను విన్పించాలని సూచించారు. బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్డీయే పక్షాలు శుక్రవారం సమావేశమయ్యాయి. సమావేశంలో మోదీ పేర్కొన్న అంశాలను పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీ మిత్రపక్ష నేత ఒకరు వెల్లడించారు. ‘సీఏఏ ముస్లింలపై వివక్ష చూపుతుందన్న ప్రతిపక్షాల వాదనను గట్టిగా తిప్పికొట్టండి.

ముస్లింలతో పాటు పౌరులంతా మనకు సమానమేనని స్పష్టం చేయండి’ అని ప్రధాని చెప్పారన్నారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌)కు సంబంధించిన ప్రశ్నావళి నుంచి కొన్ని ప్రశ్నలను తొలగించాలని సమావేశంలో మిత్రపక్షం జేడీయూ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్పీఆర్‌ నుంచి తల్లిదండ్రుల వివరాలను కోరే ప్రశ్నలను తొలగించాలని కోరామని, దానికి హోంమంత్రి అమిత్‌ షా సానుకూలంగా స్పందించారని జేడీయూ ఎంపీ లలన్‌ సింగ్‌ వెల్లడించారు. శిరోమణి అకాలీదళ్‌ కూడా తమ సూచనను సమర్ధించిందన్నారు. తల్లిదండ్రుల వివరాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబివ్వడం ఐచ్ఛికమేనని ఇప్పటికే కేంద్రమంత్రి జవదేకర్‌ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.   

చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నా
శనివారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాలు ఫలవంతమవుతాయని, సభ్యులు నాణ్యత కలిగిన చర్చను జరుపుతారని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ శుక్రవారం అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరు సభలూ ఆర్థిక సమస్యల గురించి, ప్రపంచ ఆర్థిక మందగమన నేపథ్యంలో భారత్‌ ఎలా ముందుకు సాగాలో వంటి వాటిపై విస్తృతంగా చర్చించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ దశాబ్దానికి గట్టి పునాదులు ఈ బడ్జెట్‌తోనే ప్రారంభమవ్వాలని చెప్పారు. ఈ సెషన్‌లో ఆర్థిక సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు చెప్పారు. దళితులు, మధ్యతరగతివారు, అణచివేతకు గురైన వారు, మహిళల సాధికారత కోసం ఈ దశాబ్దంలో కూడా తాము కష్టపడతామని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మొదటి విడత బడ్జెట్‌ సమావేశాలు శనివారం నుంచి ఫిబ్రవరి 11 వరకూ, రెండో దశ సమావేశాలు మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకూ జరగనున్న సంగతి తెలిసిందే.   

విపక్షాల చర్య అప్రజాస్వామికం: జీవీఎల్‌
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేసిన విపక్షాల చర్య అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ, అక్కడి అభివృద్ధి కార్యక్రమాలు, 2022 నాటికి కొత్త భారత నిర్మాణానికి మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్రపతి వివరించారు. దీనిపై సభ్యులంతా హర్షద్వానాలతో స్వాగతించగా, కొందరు ప్రతిపక్ష నాయకులు నలుగురు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయాలని ప్రయత్నం చేశారు. ఇది అప్రజాస్వామికం. వారంతా క్షమాపణలు చెప్పాలి’ అంటూ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు