ద్రవ్యోల్బణాన్ని అదుపు చేశాం

8 Mar, 2017 01:26 IST|Sakshi
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేశాం

గుజరాత్‌ పారిశ్రామిక సదస్సులో ప్రధాని మోదీ
దహేజ్‌/సూరత్‌/న్యూఢిల్లీ: గత ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని అదుపు చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుందని ప్రతిపక్షాలు అనేక అసత్యాలు ప్రచారం చేయడంతో పాటు పుకార్లు పుట్టించాయని మోదీ ఆరోపించారు. నోట్ల రద్దు అనంతరం దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక జీడీపీ లెక్కలు నిరూపించాయన్నారు.

గుజరాత్‌లోని దహేజ్‌ ప్రత్యేక ఆర్థిక మండలిలో రూ. 30 వేల కోట్లతో నిర్మించిన ఓఎన్జీసీ పెట్రో అడిషన్స్  లిమిటెడ్‌ను మంగళవారం మోదీ జాతికి అంకితం చేశారు.  ఈ సందర్భంగా నిర్వహించిన పారిశ్రామిక సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో విపక్షాలు నాపై అన్ని రకాల ఆరోపణలు చేశాయి. అయితే ద్రవ్యోల్బణం గురించి ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిపక్షాలు ద్రవ్యోల్బణం గురించి చర్చించకపోవడం చాలా పెద్ద విషయం. ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో విజయం సాధించిందని దాన్ని బట్టే అర్థమవుతుంది’ అని మోదీ పేర్కొన్నారు.  అంతకుముందు గుజరాత్‌లోని భరూచ్‌ వద్ద నర్మదా నదిపై కేబుల్‌ ఆధారంగా నిర్మించిన నాలుగు లేన్ల బ్రిడ్జిని ఆయన జాతికి అంకితం చేశారు. 1.3 కి.మి పొడవైన ఈ బ్రిడ్జి దేశంలోని పొడవైన కేబుల్‌ ఆధారిత బ్రిడ్జి కావడం విశేషం.   

ఆధ్యాత్మికతే భారత్‌ బలం
ఆధ్యాత్మికతే భారత్‌ బలమని, అయితే దురదృష్టవశాత్తూ కొంతమంది దీన్ని మతానికి ముడిపెడుతున్నారన్నారు.  మంగళవారం ఢిల్లీలో ‘యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్‌ ఇండియా(వైఎస్‌ఎస్‌)’ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనాభా, జీడీపీ, ఉద్యోగితా రేటు ఆధారంగా భారత్‌ను గుర్తిస్తున్నారని, అయితే ఆధ్యాత్మికపరంగా గుర్తించట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. మునులు, సాధువుల ద్వారా భారత ఆధ్యాత్మికత బలపడుతోందని చెప్పారు.

ఒక్కసారి యోగాపై ఆసక్తి చూపి శ్రద్ధగా సాధన చేస్తే అది జీవితంలో భాగమైపోతుందని వివరించారు. వైఎస్‌ఎస్‌ను స్థాపించిన యోగి పరమహంసను ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.  శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును మోదీ విడుదల చేశారు.

మరిన్ని వార్తలు