యుద్ధ స్మారకం అంకితం

26 Feb, 2019 02:49 IST|Sakshi
కార్యక్రమంలో మాజీ సైనికుల కుటుంబసభ్యులకు మోదీ వందనం, ఇండియా గేట్‌ సమీపంలో యుద్ధ స్మారకం

ఢిల్లీలో ప్రారంభించిన ప్రధాని మోదీ

స్వాతంత్య్రానంతరం ఇదే మొదటిది

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. బ్రిటిష్‌ కాలం నాటి యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం నిర్మించిన ఇండియా గేట్‌ పక్కనే తాజా స్మారకాన్ని 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది  అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై సువర్ణాక్షరాలతో లిఖించారు. కాంగ్రెస్‌ పార్టీపై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో సైన్యం, దేశ భద్రత నేరపూరిత నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు.

అందుకే స్మారక నిర్మాణం ఇంత ఆలస్యమైందన్నారు. స్మారక ఆవిష్కరణకు ముందు కొంతమంది మాజీ సైనికులతో మోదీ సమావేశమై అక్కడ ప్రసంగించారు. గత ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత వారి సొంత కుటుంబానికి ఉండేదనీ, తాము అధికారంలోకి తొలి ప్రాధాన్యత దేశానికి ఇచ్చామని మోదీ అన్నారు. రక్షణ ఆయుధాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, బలగాలను బలోపేతం చేయడం తదితరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉండేవనీ, తాము వచ్చాక వాటికి ఆమోదం లభించిందని మోదీ వెల్లడించారు. మాజీ సైనికుల కోసం ప్రభుత్వం మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పుతుందని చెప్పారు.

నాలుగు ఏకకేంద్రక వృత్తాల్లో..
అమర చక్ర, వీరతా చక్ర, త్యాగ చక్ర, రక్షక చక్ర అనే నాలుగు ఏక కేంద్రక వృత్తాల ఆకారంలో, రూ. 176 కోట్ల నిధులతో స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఈ నాలుగు వృత్తాల కేంద్రంలో ఓ రాతి స్థూపం, అమరజ్యోతి ఉంటాయి. వీరతా చక్రలో భారత సైన్యం పోరాడిన యుద్ధాల నమూనా చిత్రాలను కాంస్య లోహంతో చేసి గోడలపై అమర్చారు. ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం యుద్ధాల్లో పోరాడినట్లుగా చూసే ఆరు కుడ్య చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం అమరులైన సైనికుల సంస్మరణ కోసం ఓ స్మారకాన్ని నిర్మించాలని దశాబ్దాలుగా ప్రతిపాదన ఉన్నప్పటికీ అడుగు ముందుకు పడలేదు.

చివరకు మోదీ ప్రభుత్వం 2015లో స్మారక నిర్మాణానికి పచ్చజెండా ఊపగా, పనులు మాత్రం గతేడాది ఫిబ్రవరిలోనే ప్రారంభమయ్యాయి. ఈ స్మారకంలో గ్రాఫిక్‌ ప్యానెళ్లు, రాతి కుడ్య చిత్రాలు కూడా ఉన్నాయి. స్మారకం అమరసైనికులకు అంజలి ఘటించే ప్రదేశంగా ఉంటుంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ జాతీయ స్మారకాన్ని ఆవిష్కరించడం ఓ చరిత్రత్మాక ఘట్టమనీ, ఇప్పుడు భారతీయుల తీర్థయాత్రలకు మరో ప్రదేశం అందుబాటులోకి వచ్చిందన్నారు.

స్మారకం విశేషాలు
► ఇండియా–చైనా(1962), ఇండియా–పాక్‌ (1947,1965,1971), కార్గిల్‌(1999) యుద్ధాల సమయంలో, శ్రీలంకలో శాంతి పరిరక్షక దళంలో ఉంటూ అమరులైన 25,942 మంది భారత సైనికుల జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు.

► స్మారక స్థూపం పొడవు 15.5 మీటర్లు. కింది భాగంలో అమరజ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ రాతి స్థూపం చుట్టూ నాలుగు ఏక కేంద్రక వృత్తాకార వలయాలను నిర్మించారు.

► అన్నింటికన్నా బాహ్య వలయానికి రక్షక చక్ర అని పేరు పెట్టి ఆ వలయం మధ్యమధ్యల్లో 600 మొక్కలు నాటారు. ఈ మొక్కలే సైనికులుగా, దేశానికి కాపలా కాస్తున్న వారుగా దీనిని చిత్రీకరించారు.

► త్యాగ చక్ర వలయంలో 16 గోడలను నిర్మించారు. వీటిపైనే అమర సైనికుల పేర్లను గ్రానైట్‌ ఫలకాలపై బంగారు వర్ణంలో లిఖించారు. సైనికులకు నివాళి అర్పించే స్థలం ఇదే. ఈ గ్రానైట్‌ ఫలకాలను పురాతన కాలం నాటి భారతీయ యుద్ధ తంత్రం చక్రవ్యూహం ఆకారంలో అమర్చారు.

► స్మారకంలో భాగంగా ఏర్పాటు చేసిన పరమ్‌ యోధ స్థల్‌లో పరమ వీర చక్ర పురస్కారం పొందిన 21 మంది సైనికుల విగ్రహాలను నెలకొల్పారు. వీటిలో సజీవులైన సుబేదార్‌ మేజర్‌ బానాసింగ్, సుబేదార్‌ మేజర్‌ యోగేంద్ర సింగ్‌ యాదవ్, సుబేదార్‌ సంజయ్‌ కుమార్‌ల విగ్రహాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు