అత్యవసర నిధి ఏర్పాటు చేద్దాం

16 Mar, 2020 04:20 IST|Sakshi
సార్క్‌ దేశాధి నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

సార్క్‌ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు

కోవిడ్‌పై పోరుకు భారత్‌ కోటి డాలర్ల విరాళం

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై యుద్ధానికి సార్క్‌ దేశాలు నడుం బిగించాయి. కరోనాను కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టేందుకు సార్క్‌ దేశాల నేతలు ఆదివారం వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనాపై పోరుకు ‘కోవిడ్‌–19 ఎమర్జెన్సీ ఫండ్‌’ను ఏర్పాటు చేయాలన్న భారత ప్రధాని మోదీ ప్రతిపాదనకు సభ్య దేశాల నేతలు ఏకీభావం తెలిపారు. భారత్‌ తరఫున ఈ ఫండ్‌ కోసం కోటి డాలర్లను(రూ.73.95 కోట్లు) మోదీ విరాళంగా ప్రకటించారు. ‘మనం ముందు కోవిడ్‌–19 అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నా.

మొదట, భారత్‌ తరఫున కోటి డాలర్లను ఆ ఫండ్‌ కోసం ప్రకటిస్తున్నా. ఇతర సభ్య దేశాలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించాలి’ అని మోదీ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్‌లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. వైద్య నిపుణులతో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇతర వైద్య పరికరాలను, నిర్ధారణ పరీక్షలు జరిపే కిట్స్‌ను సిద్ధంగా ఉంచామన్నారు. అవసరమైతే, సార్క్‌ సభ్య దేశాలకు కూడా వాటిని సమకూర్చగలమన్నారు.

వైరస్‌ వ్యాప్తిని సమీక్షించేందుకు ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను రూపొందించామన్నారు. ఆ సాఫ్ట్‌వేర్‌ను కూడా సార్క్‌ దేశాలకు ఇస్తామన్నారు. ‘మన దేశాల్లో మొత్తంగా 150 కన్నా తక్కువ కేసులే నమోదయ్యాయి. అయినా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని హెచ్చరించారు. వేరువేరుగా కాకుండా, ఒక్కటిగా కరోనా వైరస్‌పై పోరు సాగించాలని సభ్య దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. భయాందోళనలకు గురికాకుండా, వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని సూచించారు.

వీడియో కాన్ఫెరెన్స్‌లో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్‌ ప్రధాని షెరింగ్, బంగ్లాదేశ్‌ పీఎం షేక్‌ హసీనా, అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్‌ సోలిహ్, పాక్‌ ప్రధానికి ఆరోగ్య రంగంలో ప్రత్యేక సలహాదారు జాఫర్‌ మీర్జా పాల్గొన్నారు. కరోనా నిర్మూలన లక్ష్యంతో ఏర్పాటైన ఈ కార్యక్రమంలోనూ పాకిస్తాన్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తింది. కశ్మీర్లో నిర్బంధాలను తొలగించాలని కోరింది. వైరస్‌ను అరికట్టడంలో చైనా గొప్పగా వ్యవహరించిందని పాక్‌ ప్రశంసించింది. వైరస్‌పై పోరును సమన్వయం చేసేందుకు సార్క్‌ దేశాలు ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాజపక్స సూచించారు. ప్రధాని మోదీ సూచనలను, వైరస్‌ కట్టడికి భారత్‌ చేపట్టిన చర్యలను సభ్య దేశాల నేతలు ప్రశంసించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా