మోదీ–మాక్రాన్‌ పడవ విహారం

13 Mar, 2018 02:21 IST|Sakshi

యూపీలో అతిపెద్ద సోలార్‌ విద్యుత్‌ కేంద్రం ప్రారంభం  

వారణాసి/దాదర్‌ కలాన్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ దంపతులతోపాటు ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ కేంద్రంలో ఏర్పాటుచేసిన చేనేత ప్రదర్శనను సందర్శించారు. ఇక్కడి కళాకారుల హస్తకళలు, భాదోహి కార్పెట్ల గురించి ప్రపంచ ప్రఖ్యాత బనారసీ చీరల ప్రత్యేకత గురించి మాక్రాన్‌కు మోదీ వివరించారు. అనంతరం డీడీయూ ఓపెన్‌ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన చిత్రకూట్‌ నాటకాన్ని (రాముడి 14ఏళ్ల వనవాసాన్ని ప్రతిబింబించే) తిలకించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పడవలో మోదీ, మాక్రాన్, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌లు (అస్సీ ఘాట్, దశాశ్వమేథ్‌ ఘాట్ల మధ్య) విహరించారు.

అనంతరం వారణాసి–పాట్నాల మధ్య నడిచే రైలును మోదీ ప్రారంభించారు. అంతకుముందు, మోదీ, మాక్రాన్‌ కలిసి ఉత్తరప్రదేశ్‌లోనే అతిపెద్ద సోలార్‌ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని మిర్జాపూర్‌ జిల్లా ఛాన్వే బ్లాక్‌లో ప్రారంభించారు. 75మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ సోలార్‌ ప్లాండ్‌ను రూ.500కోట్ల వ్యయంతో ఫ్రెంచ్‌ కంపెనీ ఎంజీ (ఈఎన్‌జీఐఈ) సాంకేతిక సహకారంతో నిర్మించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేసే దృష్టితో ఢిల్లీలో మార్చి 16నుంచి జరగనున్న ‘కృషి ఉన్నతి మేళా’ను మోదీ ప్రారంభించనున్నారు. కాగా, మాక్రాన్‌తో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్‌ కలసి అసత్య వార్తలు, ఉదార ప్రజాస్వామ్యాలను ప్రభావితం చేస్తున్న అంశాలపై చర్చించారు.

మరిన్ని వార్తలు