మిషన్‌ శక్తి స్పీచ్‌ : మోదీకి ఈసీ క్లీన్‌ చిట్‌

29 Mar, 2019 14:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌ విజయవంతంగా యాంటీ శాటిలైట్‌ క్షిపణిని ప్రయోగించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ఈసీ ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈసీ ప్రాధమిక నివేదికలో మోదీ ప్రసంగం నిబంధనలకు లోబడే ఉందని స్పష్టం చేసింది. ప్రధాని ప్రసంగంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు తాము ఎక్కడా గుర్తించలేదని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో ప్రధాని మిషన్‌ శక్తి ప్రసంగంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ప్రధాని ప్రసంగం ఎన్నికల నియమావళికి విరుద్ధమని విపక్షాలు ఆరోపించిన క్రమంలో ఆయన ప్రసంగాన్ని పరిశీలించేందుకు ఈసీ ఓ కమిటీని నియమించింది. మిషన్‌ శక్తిపై ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై సీపీఎం లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో ఈసీ ఈ అంశంపై కమిటీని నియమించింది. ప్రధాని మోదీ సైతం అభ్యర్థిగా సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్నందున ఆయన ప్రసంగం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీకి రాసిన లేఖలో సీపీఎం పేర్కొంది. కాగా మోదీ స్పీచ్‌పై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో బీజేపీ వర్గాలు ఊరట పొందాయి.

>
మరిన్ని వార్తలు