విమానయానం కల కాదు!

23 Oct, 2016 01:06 IST|Sakshi
విమానయానం కల కాదు!

మధ్యతరగతికి అందుబాటులో ప్రయాణం
చిన్న నగరాల్లోనూ విమానసేవలు
వడోదర టెర్మినల్ భవన  ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

వడోదర: భారత పౌర విమానయాన రంగం మిషన్‌మోడ్(లక్ష్యాలను నిర్దేశించుకుని, కార్యాచరణ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని అమలుకు సిద్ధంగా)లో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. శనివారం వడోదర విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని జాతికి అంకితం చేసిన తర్వాత మోదీ మాట్లాడారు. మధ్యతరగతి కుటుంబీకులకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ఈ రంగంలో మరింత విస్తృతమైన పురోగతికి బాటలు పడతాయన్నారు. త్వరలోనే విమానాశ్రయాల కార్యకలాపాల్లో ప్రపంచంలోనే మూడో స్థానాన్ని అందుకోనున్నట్లు తెలిపారు. విస్తీర్ణంలో పెద్దదైన భారత్‌కు 80 నుంచి 100 ఎయిర్‌పోర్టులున్నా సరిపోవని.. 2టైర్, 3టైర్ నగరాల్లో వినియోగంలోలేని విమానాశ్రయాలను మళ్లీ తెరవాల్సిన అవసరం ఉందన్నారు.

తొలి ఏవియేషన్ విధానం తెచ్చాం
ప్రాంతీయ అనుసంధాన పథకం ద్వారా 500 కిలోమీటర్ల దూరాన్ని రూ.2,500కే అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే.. స్వతంత్ర భారతంలో తొలిసారిగా ఏవియేషన్ పాలసీని తీసుకొచ్చింది. దీనికోసం మిషన్‌మోడ్‌లో మా ప్రభుత్వం పనిచేస్తోంది. వినియోగదారుల అవసరాలపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాం’ అని తెలిపారు. ఈ రంగం వృద్ధి చెందటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వడోదరలో తొలి రైల్వేవర్సిటీ ఏర్పాటు కానుందని.. దీని వల్ల రైల్వే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు.

అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ లెక్కల ప్రకారం 2035 కల్లా భారత్‌లో 32.5 కోట్ల మంది విమానప్రయాణీకులు పెరగనున్నారు. 2026 కల్లా ఈ విషయంలో యూకేను భారత్ మించిపోనుంది. వడోదర పూర్తి పర్యావరణ అనుకూలమైన, విద్యుత్‌ను ఆదా చేసే (సోలార్‌తో నడిచే) విమానాశ్రయమని ప్రధాని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విమాన ప్రయాణికుల సంఖ్యలో 20% పెరుగుదల ఉందని పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు.

నల్లధనంపై ‘సర్జికల్’ లేకుండానే..
అనంతరం దివ్యాంగులకు సహాయ పరికరాల ప్రదానోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు వికలాంగుల సమస్యలను విస్మరించాయని విమర్శించిన మోదీ.. తమ ప్రభుత్వం వీరి సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిందన్నారు. ఇటీవల పీవోకేలో జరిపిన సర్జికల్ స్ట్రైక్‌ను ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ.. నల్లధనం విషయంలో ఇలాంటి దాడులు జరపకుండానే.. రూ. 65వేల కోట్లుబయటకు (జరిమానా, పన్నుల రూపంలో) వచ్చాయన్నారు. సబ్సిడీల్లో లీకేజీలను అరికట్టడం ద్వారా మరో రూ.36వేల కోట్లు ప్రభుత్వానికి మిగిలాయన్నారు. ఇక్కడ సర్జికల్ దాడులు జరగకుండానే లక్షకోట్లు బయటకొచ్చాయన్నారు. నల్లధనం విషయంలో మరింత సమయం ఇచ్చామని.. అవన్నీ బయటకు తెస్తామని మోదీ తెలిపారు.
 
పాపకు మోదీ నామకరణం
ప్రధాని మోదీ మరో చిన్నారికి నామకరణం చేశారు.   ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లా మారుమూల ప్రాంతానికి చెందిన భరత్ సింగ్, విభా సింగ్‌ల బిడ్డకు ఆయన పేరు పెట్టారు.  ఈ దంపతులకు ఆగస్టు 13న కూతురు జన్మించింది. పాపకు పేరు పెట్టాలని మోదీని కోరుతూ  వీరు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. బాలికల విషయంలో మోదీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశంసిస్తూ.. ఒలింపిక్స్‌లో ఇద్దరు యువతులే పతకాలు తీసుకురావటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. సరిగ్గా వారం రోజుల తర్వాత (సెప్టెంబర్ 20న) వీరికి ప్రధాని ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరి బిడ్డకు తల్లి, తండ్రి పేరు కలిపి ‘వైభవి’ అని పేరుపెట్టారు.

రెండు నిమిషాలు మాట్లాడారు. ఈ ఆనందాన్ని పంచుకునేందుకు గ్రామంలో అందరికీ ‘ప్రధాని ఫోన్’ గురించి భరత్ చెప్పాడు. దీన్నెవరూ నమ్మలేదు. దీంతో తనకు కాల్ వచ్చిన నెంబరుకు (పీఎంవో) తిరిగి కాల్ చేసి.. ప్రధాని నుంచి లేఖ వస్తే సంతోషిస్తామని కోరారు. వస్తుందో రాదో అని పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ ఆశ్చర్యంగా ఆగస్టు 30న వీరికి పీఎంవో నుంచి లేఖ వచ్చింది. ‘మీరు వైభవి ఆకాంక్షలను పూర్తి చేస్తారు. వైభవి మీ శక్తి. శుభాకాంక్షలు’ అని లేఖ సారాంశం. దీంతో భరత్, విభ దంపతుల ఆనందానికి హద్దుల్లేవు.

మరిన్ని వార్తలు