సీఎంలతో నేడు మోదీ చర్చలు

11 Apr, 2020 04:11 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 14వ తేదీ తరువాత ఎత్తివేయాలా? వద్దా? అన్న అంశంపై ప్రధాని మోదీ శనివారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ సమావేశం అనంతరమే లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రధాని ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రుల అభిప్రాయాలను, సలహా, సూచనలను తీసుకోనున్నారు.

అయితే పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ పొడిగింపునకు మద్దతు తెలిపిన నేపథ్యంలో తుది నిర్ణయం కూడా ఇదే దిశగా ఉండవచ్చునని అంచనా. పార్లమెంటులో వేర్వేరు రాజకీయ పార్టీల నేతలతో మోదీ మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఏప్రిల్‌ 14వ తేదీ తరువాత ఒకేసారి లాక్‌డౌన్‌ ఎత్తివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ప్రాణాన్ని కాపాడుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రాలు, జిల్లా స్థాయి యంత్రాంగం, నిపుణులు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలనే సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒడిశా ఒకడుగు ముందుకేసి ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించింది కూడా. ప్రధాని మోదీ సీఎంలతో సంప్రదింపులు జరపడం ఇది రెండోసారి. ఏప్రిల్‌ 2న తొలి సమావేశంలో దశలవారీ లాక్‌డౌన్‌ ఎత్తివేతకు అనుకూలంగా ప్రధాని మాట్లాడారు.

సమూహ వ్యాప్తి లేదు: కేంద్రం
న్యూఢిల్లీ/భువనేశ్వర్‌/చండీగఢ్‌: కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో ఇప్పటివరకు సమూహ వ్యాప్తి(కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) దశ రాలేదని కేంద్రం ప్రకటించింది. అలాంటిదేమైనా ఉంటే, ప్రజల్లో అప్రమత్తత పెంచేందుకు ముందు మీడియాకే చెప్తామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ శుక్రవారం వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ బారిన పడిన 104 మందిలో 40 మందికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ కానీ, పాజిటివ్‌గా తేలిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న చరిత్ర కానీ లేదని తేలిందని ఐసీఎంఆర్‌ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించగా, లవ్‌ అగర్వాల్‌ పై సమాధానం ఇచ్చారు.

మరోవైపు, కోవిడ్‌–9పై సమర్ధవంతంగా పనిచేస్తుందని తేలిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేయాలంటూ పలు దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే, భారత్‌కు అవసరమైన స్టాక్‌ ఉన్న తరువాత, మిగతా స్టాక్‌ను ఎగుమతి చేయాలని నిర్ణయించామని తెలిపింది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు తీసుకువచ్చే విషయంపై.. కరోనా వ్యాప్తి పరిస్థితిని సమీక్షించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి దమ్ము రవి తెలిపారు.

అది ప్రమాదకరం
కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడి చేయకముందే తొందరపడి ఆంక్షలను ఎత్తివేస్తే అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అలా చేస్తే.. వైరస్‌ వ్యాప్తి అడ్డుకోలేని దశకు చేరుకునే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది.  

లాక్‌డౌన్‌పై మీ అభిప్రాయం ఏమిటి?   
దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై తమ అభిప్రాయాలు తెలపాల్సిందిగా కేంద్ర హోం శాఖ శుక్రవారం రాష్ట్రాలను కోరింది.  ఏప్రిల్‌ 14 తరువాత మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్న వార్తలు వస్తున్న తరుణంలో హోంశాఖ ఈ∙సమాచారం కోరడం విశేషం.   గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలన్న సూచనలు ఎక్కువగా  రాష్ట్రాల నుంచి ఉన్నాయని తెలిసింది. లాక్‌డౌన్‌ సందర్భంగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంతోపాటు అత్యవసర వస్తువుల విక్రయ కేంద్రాలు తెరిచే ఉంటాయని కేంద్రం ప్రకటించింది. వీటితోపాటు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోలీస్, మీడియా, బ్యాంకులు పనిచేస్తాయని చెప్పింది.    

మాస్కు లేకపోతే పెట్రోలుకు నో!
ముఖానికి మాస్కు లేనివారికి పెట్రోలు పంపుల్లో ఇంధనం నింపేది లేదని ఒడిశా రాష్ట్రం ఉత్కళ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ శుక్రవారం ప్రకటించింది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో పంజాబ్‌ రాష్ట్రం లాక్‌డౌన్‌ను మే  ఒకటో తేదీ వరకూ పొడిగించింది. ఒడిశా ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే.

మతపరమైన ఊరేగింపులు వద్దు
ఏప్రిల్‌ నెలలో వివిధ పండుగల సందర్భంగా మతపరమైన ఊరేగింపులు, గుమికూడటంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాగరూకతతో వ్యవహరించాలని హోం శాఖ శుక్రవారం హెచ్చరించింది. అభ్యంతరకరమైన సమాచారం ఏదీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టకుండా నిఘా ఉంచాలని, లాక్‌డౌన్‌ ఆంక్షలన్నీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ నెలలో ఇప్పటికే కొన్ని మతపరమైన కార్యక్రమాలు పూర్తికాగా, బైశాఖీ, రోంగలి బీహూ, విషు, పోయినా బైశాఖ్, పుతాండు, మహా విశుబా సంక్రాంతి వంటి పండుగలన్నీ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై ప్రభుత్వ అధికారులు, మత సంస్థలు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ కోరింది. లాక్‌డౌన్‌ మార్గదర్శకాల ఉల్లంఘనలపై భారతీయ శిక్షాస్మృతి, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఆక్ట్‌ల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు