భారతీయ టెక్కీలకు మోదీ సరికొత్త చాలెంజ్‌

4 Jul, 2020 19:44 IST|Sakshi

ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్ ఆవిష్కరించిన ప్రధాని మోదీ

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ స్థాయిలో ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్‌లను రూపొందించేందుకు దేశ నలుమూలల ఉన్న సాఫ్ట్‌వేర్ టెక్కీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ‘ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను ప్రకటించారు. ఇందులో పాల్గొనాలని దేశీయ టెక్‌ కంపెనీలు, స్టార్టప్‌లను ప్రధాని మోదీ కోరారు. మెయిటీ (MeitY), అటల్‌ ఇన్నొవేషన్‌ మిషన్‌, నీతి ఆయోగ్‌ల సంయుక్తంగా ఈ యాప్ ఇన్నొవేషన్ చాలెంజ్ నిర్వహించనున్నాయి. (చదవండి : భారత్‌కు పెరుగుతున్న మద్దతు!)

‘ప్రస్తుతం యాప్స్ తయారు చేసే ఔత్సాహికులు చాలా మంది ఉన్నారు. టెక్, స్టార్టప్స్‌లో వరల్డ్ క్లాస్ మేడిన్ ఇండియా యాప్స్ తయారు చేయగల సత్తా ఉంది. వారి ఐడియాలు, ఉత్పత్తులకు ప్రోతాహం కల్పించేందుకు ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నొవేషన్ ఛాలెంజ్ నిర్వహిస్తోంది. యాప్స్ విభాగంలో మీకు అనుభవం, టాలెంట్, ఆసక్తి, కొత్త ఐడియాలు సృష్టించగల ఉత్సాహం, ప్లాన్ ఉన్నవారు ఇందులో పాల్గొనవచ్చు’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక టెక్కీలు, స్టార్టప్‌లు మేడిన్‌ ఇండియా యాప్‌లను డెవలప్‌ చేసేందుకు ఈ చాలెంజ్‌ ఉపయోగపడుతుంది. ఇందులో గెలిచిన వారికి బహుమతులతోపాటు పేరు ప్రఖ్యాతులు కూడా దక్కనున్నాయి. ఆయా విభాగాల్లో డెవలప్‌ చేసే అత్యుత్తమ యాప్‌లకు రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల భారీ నగదు బహుమతులను ఔత్సాహికులు పొందవచ్చు. యాప్‌లు సులభంగా వాడుకునే విధంగా, పూర్తిగా సురక్షితమైన ఫీచర్లు కలిగి ఉండాలి. ఈ చాలెంజ్‌ వల్ల దేశంలో ఉన్న ఔత్సాహిక యాప్‌ డెవలపర్లు, స్టార్టప్‌ల నుంచి ప్రతిభను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ చాలెంజ్‌కు చెందిన పూర్తి వివరాల కోసం innovate.mygov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ చాలెంజ్‌లో పాల్గొనాలనుకునే వారు తమ అప్లికేషన్లను జూలై 18, 2020లోపు సమర్పించాలి.

మరిన్ని వార్తలు